సీటీ స్కాన్‌: ఎయిమ్స్ డైరెక్టర్  వాదనలను ఖండించిన ఐఆర్ఐఏ 

6 May, 2021 17:42 IST|Sakshi

 ఒ‍క్క సిటీ స్కాన్ 300-400 ఎక్స్-రేలకు సమానం: ఎయిమ్స్

ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా వ్యాఖ్యలు  అశాస్త్రీయం, బాధ్యతా రహితమైనవి

సాక్షి, న్యూఢిల్లీ : కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ లేదా  సీటీ స్కాన్లు చాలా హానికరం అన్న ఎయిమ్స్ డైరెక్టర్  డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా వ్యాఖ్యలపై ఇండియన్ రేడియోలాజికల్ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్ స్పందించింది. ఒక్క సీటీ స్కాన్ 300-400ఎక్స్-రేలకు సమానమని, క్యాన్సర్‌  వచ్చే అవకాశం ఉందన్న వాదనలు  చాలా ఔట్‌ డేటెడ్‌  సిద్ధాంతమని  అసోసియేషన్ కొట్టి పారేసింది.  ఈ వాదన 30-40 సంవత్సరాల క్రితం నాటిదని ఐఆర్‌ఐఏ పేర్కొంది 5-10 ఎక్స్-కిరణాలతో పోల్చదగిన రేడియేషన్‌ను విడుదల చేసే అత్యాధునిక స్కానర్లు ఇపుడు అందుబాటులోకి వచ్చాయంటూ గులేరియా వ్యాఖ్యలను అసోసియేషన్‌  ఖండించింది.  గులేరియా వ్యాఖ్యలు అశాస్త్రీయమైనవి, బాధ్యతా రహితమైనంటూ అసోసియన్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్ సి. అమర్‌నాథ్ సంతకంతో ఒక ప్రకటన విడుదల చేసింది. సిటీ ఛాతీ స్కాన్ క్యాన్సర్‌కు కారణమవుతుందనే ప్రకటన ఆందోళనకరంగా ఉందని వ్యాఖ్యానించింది. ప్రపంచవ్యాప్తంగా రేడియాలజిస్టులు అలారా (ఏఎల్‌ఏఆర్‌ఏ: సహేతుకంగా సాధించగలిగినంత తక్కువ) సూత్రాన్ని ఉపయోగిస్తున్నారన్నారు.   దీన్నుంచి వచ్చే రేడియేషన్  ఒక వ్యక్తి ఒక సంవత్సరానికి గురయ్యే రేడియేషన్‌కు సమానమని కూడా తెలిపింది. (అలర్ట్‌: సీటీ స్కాన్‌తో క్యాన్సర్‌ వచ్చే అవకాశం..)

కోవిడ్‌ సోకిన వారు వివిధ రకాల లక్షణాలతో బాధపడుతున్నారనీ, తక్కువ వైరల్ లోడ్ కారణంగా, ఆర్‌టీ పీసీఆర్‌ నెగిటివ్‌ వచ్చినా, ఊపిరితిత్తులు కొందరిలో పాడైపోతున్నాయని, ఇలాంటి సమయంలో సిటీ స్కాన్‌ అవసరం చాలా ఉందని పేర్కొంది. అంతేకాదు ప్రారంభ దశలో ఊపిరితిత్తుల పనితీరును గుర్తించే పల్స్‌ ఆక్సీమీటర్‌ కంటే సీటీ స్కాన్లు అత్యంత సున్నితమైనవి ఐఆర్ఐఎ తెలిపింది. ముఖ్యంగా కరోనా సెకండ్‌వేవ్‌లో యువకులు హ్యాపీ హైపోక్సియా (ఎటువంటి  వ్యాధి లక్షణాలు కనిపించకుండా, ఆక్సిజన్‌ స్థాయి పడిపోవడం) తోబాధపడుతున్నారని ఈక్రమంలో ఎంత త్వరగా చికిత్స ప్రారంభిస్తే,  రోగిని కాపాడటం అంత సులభమని  వెల్లడించింది. తద్వారా వ్యాధి  తీవ్రతను ముందస్తుగా గుర్తించడంతోపాటు,  తొందరగా చికిత్సను ప్రారంభించడానికి సహాయపడుతుందని తెలిపింది.అలాగే వారు  సూపర్-స్ప్రెడర్లు కాకుండా నిరోధించగల. సిటీ స్కాన్‌ ద్వారా బాధితులు ఆసుపత్రిలో చేరాలా, లేదా ఇంట్లో ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందితే సరిపోతుందా అనేది తెలుసుకోవచ్చు. వైరస్‌ తీవ్రతను, అతి విస్తరిస్తున్న తీరును పర్యవేక్షించవచ్చు, ముఖ్యంగా తీవ్ర లక్షణాలున్నవారిలో సిటీ స్కాన్‌ పాత్ర అనూహ్యం. సరైన సమయంలో స్టెరాయిడ్లను ప్రారంభించడం ద్వారా ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని తెలిపింది.  అలాగే ఆసుపత్రులలో బెడ్స్‌ కొరత, ఆక్సిజన్‌ కొరత లాంటి సంక్షోభంనుంచి బయటపడవచ్చని  స్పష్టం చేసింది.  (కరోనా మరణ మృదంగం: సంచలన అంచనాలు)

కాగా ఒక్క సీటీ స్కాన్‌ 300-400 ఎక్స్‌రేలతో సమానమని, దానితో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా ఇటీవల వ్యాఖ్యానించారు. అవసరమైతే తప్ప  సీటీ స్కాన్ల జోలికి వెళ్లొద్దని సూచించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు