రెమిడెసివిర్‌ సంజీవని కాదు.. అలా వాడటం అనైతికం!

20 Apr, 2021 12:50 IST|Sakshi
ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా

న్యూఢిల్లీ: రెమిడెసివిర్‌ ఇంజక్షన్‌ ప్రాణాలను నిలబెట్టే సంజీవని కాదని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కోవిడ్‌ పేషెంట్లకు ‘అనవసరంగా, అహేతుకంగా’ రెమిడెసివిర్‌ను వాడటం ‘అనైతికం’ అని స్పష్టం చేసింది. దేశంలో కరోనా కేసులు అనూహ్యంగా పెరిగిపోతున్న నేపథ్యంలో రెమిడెసివిర్‌కు తీవ్ర డిమాండ్‌ ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ ఔషధానికి విపరీతమైన కొరత ఉందని, సరఫరా పెంచాలని అత్యధికంగా కేసులు వస్తున్న రాష్ట్రాలన్నీ కేంద్రాన్ని నిత్యం అభ్యర్థిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం సోమవారం దీని సమర్థత, వాడకంపై స్పష్టతనిచ్చింది.

జాతీయ కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ సభ్యుడైన ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా మాట్లాడుతూ.. ‘రెమిడెసివిర్‌ సంజీవని కాదనేది ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి. మరణాలను ఇది తగ్గించదు. మరో మంచి యాంటీవైరల్‌ డ్రగ్‌ లేనందువల్ల రెమిడెసివిర్‌ను వాడుతున్నాం. ఆసుపత్రుల్లో చేరి... ఆక్సిజన్‌పై ఉన్నవాళ్లకు ఇది ఉపయుక్తంగా ఉంటుందని రుజువైంది. సాధారణ యాంటీబయోటిక్‌లా దీన్ని వాడకూడదు’అని వివరించారు.  

రెమిడెసివిర్‌ను అనవసరంగా/ అహేతుకంగా వాడటం అనైతికం! 

  • రెమిడెసివిర్‌ ప్రయోగాత్మకంగా పరిశీలనలో ఉన్న ఔషధమే. అత్యవసర వినియోగానికి అనుమతించబడింది.  
  • కోవిడ్‌–19లో ఇది ప్రాణాలను నిలబెట్టే ఔషధం కాదు దీనివల్ల మరణాలు తగ్గుతాయని అధ్యయనాల్లో నిరూపితం కాలేదు 
  • ఆసుపత్రుల్లో ఇన్‌పేషెంట్లకు మాత్రమే రెమిడెసివిర్‌ను ఇవ్వాలి. 
  • ఓ మోస్తరు వ్యాధి తీవ్రతతో బాధపడుతూ ఆక్సిజన్‌పై ఉన్నవారికి మాత్రమే దీనిని సిఫారసు చేస్తారు. 
  • ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్న కోవిడ్‌ పేషెంట్లకు రెమిడెసివిర్‌ను వేయకూడదు. 
మరిన్ని వార్తలు