ఒడిశా రైలు ప్రమాదం అనంతరం కలవరపెడుతున్న మరో సమస్య...  

6 Jun, 2023 17:04 IST|Sakshi

ఒడిశా రైలు ప్రమాదంలో చనిపోయినవారి మృతదేహాలను ఎక్కువరోజులు కుళ్ళిపోకుండా చూడటం కష్టసాధ్యమైనదని అన్నారు ఢిల్లీ ఎయిమ్స్ అనాటమీ డిపార్ట్ మెంట్ హెడ్ డాక్టర్ ఎ. షరీఫ్. 

విషాదంలో విషాదం... 
భారత దేశ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన సంఘటనల్లో ఒకటిగా నిలిచింది ఒడిశా మూడు రైళ్ల ప్రమాదం. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 278 మంది చనిపోయినట్టు చెబుతున్నారు అధికారులు. చాలావరకు మృతదేహాలను వారి బంధువులు గుర్తించి తీసుకుని వెళ్లగా మరికొన్నిటిని భువనేశ్వర్ ఎయిమ్స్ సహా మరికొన్ని ప్రయివేటు ఆసుపత్రులలో భద్రపరిచారు. అవన్నీ అనాధ శవాలుగా మిగిలిపోయాయి. 

వందకుపైగా గుర్తుతెలియని మృతదేహాలు  
వీటిలో ఇంకా గుర్తు తెలియని మృతదేహాల సంఖ్య వందకు పైగా ఉంది. ఇదిలా ఉండగా ఈ మృతదేహాలను భద్రపరచడంలో ఒడిశా ప్రభుత్వం పెను సవాళ్ళను ఎదుర్కుంటోంది. ఎక్కువ రోజులపాటు మృతదేహాలు కుళ్ళిపోకుండా చూడటంలో సిబ్బందికి అనేక ఇబ్బందులెదురవుతూ ఉన్నాయి. 

ఎక్కువరోజులు కష్టమే... 
ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎయిమ్స్ అనాటమీ శాఖాధిపతి డాక్టర్ షరీఫ్ మాట్లాడుతూ ఛిద్రమైన శవాలను ఎక్కువ రోజులు భద్రపరచడం మంచిది కాదు. మొదటి పన్నెండు గంటల్లోనే మృతదేహాన్ని సరైన ప్రమాణాలను పాటించి జాగ్రత్తపరిస్తే తప్ప వాటిని ఎక్కువరోజులు భద్రపరచలేము. ఈ సంఘటన జరిగి ఇప్పటికే 80 గంటలు పైబడడంతో వీటిని కుళ్లిపోకుండా చూడటం కష్టసాధ్యమైన పనేనని అన్నారు. 

భువనేశ్వర్ ఎయిమ్స్ ఆసుపత్రికి ఆదివారం రోజున 139 మృతదేహాలు తీసుకుని వచ్చారు. వారి బంధువులెవరైనా వచ్చి గుర్తిస్తారని వాటిని ఐదు ఫ్రీజర్ల సాయంతో భద్రపరచి ఉంచారు. 30 గంటలు దాటిన తర్వాత నుంచి వాటిని డీకంపోజ్ కాకుండా ఉంచటానికి మరి ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుందని ఆయన అన్నారు.    

   

మరిన్ని వార్తలు