Air Ambulance: టైర్‌ ఊడినా విమానం క్షేమంగా దిగింది!

7 May, 2021 12:25 IST|Sakshi

ముంబై: అది గుర్గావ్‌లోని జెట్‌ సర్వ్‌ ఏవియేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన ఎయిర్‌ అంబులెన్స్‌. గురువారం సాయంత్రం మహారాష్ట్రలోని నాగపూర్‌ నుంచి ముంబైకి బయలుదేరింది. అందులో ఒక రోగి, అతడి బంధువు, ఒక వైద్యుడు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. మొత్తం ఐదుగురు. విమానం నాగపూర్‌లో టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే ఒక టైర్‌ ఊడిపోయింది. ఈ విషయాన్ని సిబ్బంది గుర్తించారు. ముంబై ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారం చేరవేశారు. విమానాన్ని రన్‌వేపై క్షేమంగా ఎలా దించాలన్నదే సమస్య. నేరుగా దిగితే మంటలు వ్యాపించడం ఖాయం.

అందులోని ఐదుగురు ప్రాణాలతో మిగులుతారన్న గ్యారంటీ లేదు. చురుగ్గా ఆలోచించారు. విమానాశ్రయంలో ఫుల్‌ ఎమర్జెన్సీ ప్రకటించారు. రన్‌వేపై నురగతో కూడిన నీళ్లు చల్లారు. టైర్లు పనిచేసే పరిస్థితి లేదు కాబట్టి విమానం కడుపు భాగం రన్‌వేపై సురక్షితంగా దిగింది. అందులోని ఐదుగురు నిక్షేపంగా బయటికొచ్చారు. ఇంకేముంది కథ సుఖాంతమయ్యింది. ఇతర విమానాలు యథావిధిగా రాకపోకలు సాగించాయి. ముంబై ఎయిర్‌పోర్టులో ఈ విమానం దిగిన దృశ్యాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.   

చదవండి: 'థర్డ్‌ వేవ్‌ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధం'

మరిన్ని వార్తలు