Indian Air Force Day: ప్రపంచంలో ‘4’వ ఘనత.. వాళ్లనే వెనక్కి నెట్టాం, మన గగన ‘దమ్ము’ గురించి తెలుసుకోండి

8 Oct, 2021 07:52 IST|Sakshi

Indian Air Force Day 2021:దేశ రక్షణలో సైన్యం పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. మూడు విభాగాలతో రక్షణ, నిఘాతో సరిహద్దుల్లోనే కాదు.. అవసరం పడితే దేశం లోపల కూడా తమ సేవల్ని అందిస్తుంటాయి.  అక్టోబర్‌ 8న అంటే ఇవాళ ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ డే. ఈ సందర్భంగా భారత వాయు సేన గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చూద్దాం. 

యునైటెడ్‌ కింగ్‌డమ్‌కి చెందిన రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌ ప్రోత్సాహంతో పుట్టుకొచ్చింది ఈ విభాగం. 

ప్రతీ ఏడాది ఉత్తర ప్రదేశ్‌ ఘజియాబాద్‌ ‘హిందాన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ స్టేషన్‌’లో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ డే ఉత్సవాలను నిర్వహిస్తారు. 

ఐఏఎఫ్‌ చీఫ్‌, సీనియర్‌ అధికారులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. 

ఎయిర్‌క్రాఫ్ట్‌ల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది ఈ వేడుకలకు.

 

భారత వాయు సేన.. అక్టోబర్‌ 8, 1932న అధికారికంగా బ్రిటిష్‌ పాలనలో మొదలైంది.

ఏప్రిల్‌ 1, 1933 నుంచి నుంచి సేవలు(కేవలం శిక్షణ కోసం) మొదలుపెట్టినప్పటికీ.. పూర్తిస్థాయిలో రెండో ప్రపంచ యుద్ధంలోనే రంగంలోకి దిగింది. 

ఆ టైంలో ఈ విభాగం పేరు.. రాయల్‌ ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌.

ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌(IAF).. దేశం తరపున ఆకాశ మార్గానా గస్తీ కాచే, శత్రువులతో పోరాడే కీలక సైన్య విభాగం. 
 
పాక్‌, చైనాతో జరిగిన యుద్ధాల్లోనూ ఐఏఎఫ్‌ సేవలు మరువలేనివి. 

గత 89 ఏళ్లుగా.. ముఖ్యంగా స్వాతంత్ర్యం అనంతరం.. వాయు సేన క్రమక్రమంగా తన సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోతోంది. ఈ క్రమంలో బ్రిటన్‌ రాయల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ను సైతం వెనక్కి నెట్టేసింది. ప్రస్తుతం అమెరికా, చైనా, రష్యాల తర్వాత అతిపెద్ద వాయుసేనను కలిగి ఉన్న వ్యవస్థగా  భారత్‌  నిలిచింది.

 

ఐఎఎఫ్‌ నినాదం ‘నభమ్‌ స్పర్శమ్‌ దీప్తమ్‌’(ఇంగ్లీష్‌లో టచ్‌ ది స్కై విత్‌ గ్లోరీ) అంటే.. ఆకాశాన్ని అంటే కీర్తి అని అర్థం. భగవద్గీతలోని పదకొండవ అధ్యయం నుంచి ఈ వాక్యాన్ని భారత​ వాయు సేన స్ఫూర్తిగా తీసుకోవడం విశేషం. 

భారత వాయు సేనలో ప్రస్తుతం సుమారు 1,400 ఎయిర్‌క్రాఫ్ట్‌లు, లక్షా డెబ్భై వేల మంది సిబ్బంది ఉన్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. 

యూపీ హిందాన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ స్టేషన్‌.. ఆసియాలో అతిపెద్ద, ప్రపంచంలో 8వ పెద్ద ఎయిర్‌ బేస్‌. అందుకే ఇక్కడ ఉత్సవాల్ని నిర్వహిస్తారు.

 

ఆపరేషన్‌ పుమాలై, ఆపరేషన్‌ విజయ్‌, ఆపరేషన్‌ మేఘదూత్‌.. ఇలా ఎన్నో ఆపరేషన్లలో ఐఎఎఫ్‌ సేవలు మరువలేనిది. 

యుద్ధ సమయంలోనే కాదు.. జాతి ప్రయోజనాల కోసం సైతం పని చేస్తుంది భారత వాయు సేన. గుజరాత్‌ తుపాన్‌(1998), సునామీ(2004), ఉత్తరాది వరదల సమయంలో సేవలు అందించింది కూడా. ముఖ్యంగా ఉత్తరాఖండ్‌ వరదల సమయంలో ‘రాహత్‌’ ఆపరేషన్‌ ద్వారా 20 వేల మంది ప్రాణాలు కాపాడగలిగింది ఐఎఎఫ్‌.

ఐక్యరాజ్య సమితి శాంతి చర్యల్లోనూ ఐఎఎఫ్‌ పాల్గొంటోంది. 

వాయు సేనలో మహిళలకు ఉన్నత ప్రాధాన్యం ఉంటోంది. నేవిగేటర్ల దగ్గరి నుంచి పైలట్లు, ఉన్నత స్థాయి పదవుల్లో కొనసాగుతున్నారు.

- సాక్షి, వెబ్‌ స్పెషల్‌

మరిన్ని వార్తలు