-

16 వేల కిమీ.. 17 గంటలు.. అంతా మహిళలే

9 Jan, 2021 18:14 IST|Sakshi

రికార్డు సృష్టించబోతున్న ఎయిర్‌ ఇండియా సంస్థ

న్యూఢిల్లీ: ఎయిర్‌ ఇండియా మహిళా సిబ్బంది రికార్డు సృష్టించబోతున్నారు. లాంగెస్ట్‌ కమర్షియల్‌ ఫ్లైట్‌ జర్నీ చేయబోతున్నారు. సుమారు 17 గంటల పాటు.. 16 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించనున్నారు. బోయింగ్‌ 777-200 ఎల్‌ఆర్‌ విమానంలో ఈ ప్రయాణం చేయబోతున్నారు. సాన్‌ ఫ్రాన్సిస్కో నుంచి బెంగుళూరు వరకు ఈ ప్రయాణం కొనసాగనుంది. ఈ సందర్భంగా ఏఐ 176 విమానంలో ప్రధాన పైలట్,  కెప్టెన్ జోయా అగర్వాల్ మాట్లాడుతూ.. ‘సుమారు 16 వేల కిలోమీటర్ల దూరం పూర్తిగా మహిళా సిబ్బందితోనే ఈ సుదీర్ఘ ప్రయాణం కొనసాగబోతుంది. మేం ఉత్తర ధృవం మీదుగా అత్యంత సుదూర విమానయానం చేయనున్నాం.. అయితే ఇది ఇది సౌర వికిరణాలు, అల్లకల్లోలం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉండనుంది. ఉత్తర ధృవం మీదుగా విమానాన్ని నడపడం ఎంతో సవాలుతో కూడుకున్న విషయం. కానీ మేం దీన్ని పూర్తి చేయాలని బలంగా నిర్ణయించకున్నాం. చరిత్రని తిరగరాస్తమనే నమ్మకం ఉంది’ అన్నారు. ఈ విమానం ఈ రోజు రాత్రి 8:30 గంటలకు (స్థానిక సమయం) సాన్‌ఫ్రాన్సిస్కో నుంచి బయలుదేరి 2021 జనవరి 11 న తెల్లవారుజామున 3.45 గంటలకు (స్థానిక సమయం) బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటుంది. (చదవండి: ఆమె పేరుతో ‘ఎయిర్‌ ఇండియా’లో రికార్డు)

ఆర్కిటిక్ మీదుగా  ప్రయాణించడం వలన రెండు సాంకేతిక కేంద్రాలైన బెంగళూరు, సాన్ ‌ఫ్రాన్సిస్కోల మధ్య దూరం తగ్గుతుంది. ఈ రెండు ప్రాంతాలు సుమారు 13,993 కిలోమీటర్ల దూరంలో.. ప్రపంచం వ్యతిరేక చివరలలో 13.5 గంటల టైమ్ జోన్ లాగ్‌తో ఉంటాయి. ఈ మార్గంలో సాన్ ‌ఫ్రాన్సిస్కో-సీటెల్-వాంకోవర్ ఉంటాయి. ‘మేము ఉత్తరాన 82 డిగ్రీల వరకు వెళ్తాము. సాంకేతికంగా చెప్పాలంటే మేం ధృవం మీద ప్రయాణం చేయం.. దాని పక్కనే ఉంటాము. ఆపై మేము దక్షిణాన, చాలావరకు రష్యా మీదుగా.. దక్షిణాన ఇంకా కిందుగా బెంగళూరుకు వస్తాము" అని విమానంలో ఉన్న నలుగురు పైలట్లలో ఒకరు, కెప్టెన్ పాపగారి తన్మై వెల్లడించారు. ఫ్లైట్ సేఫ్టీ ఎయిర్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, కెప్టెన్ నివేదా భాసిన్ కూడా ఈ విమానంలో ప్రయాణిస్తున్నట్లు ఎయిర్‌లైన్‌ ఒక ప్రకటనలో తెలిపింది. (చదవండి: ఎయిరిండియాపై టాటా గురి..)

ఇది ప్రయాణం అమెరికా వెస్ట్ కోస్ట్, దక్షిణ భారతదేశం మధ్య మొట్టమొదటి నాన్-స్టాప్ రూట్‌ అని ఎయిర్‌లైన్‌ తెలిపింది. ఇదిలా ఉండగా ఎయిర్ ఇండియా తన మొదటి నాన్-స్టాప్ సర్వీసును హైదరాబాద్-చికాగో మధ్య జనవరి 15 నుంచి ప్రారంభించాలని యోచిస్తోంది.

మరిన్ని వార్తలు