నార్త్‌పోల్‌ మీదుగా..!

9 Jan, 2021 04:19 IST|Sakshi

మహిళా పైలట్ల బృందం సాహసం

న్యూఢిల్లీ: ఎయిర్‌ ఇండియాకు చెందిన మహిళా పైలట్ల బృందం చరిత్ర సృష్టించనుంది. బోయింగ్‌ 777 విమానంలో సాన్‌ ఫ్రాన్సిస్కో నుంచి ప్రారంభమై ఉత్తర ధృవం మీదుగా అత్యంత సుదూర వైమానిక మార్గంలో ప్రయాణించి నేడు(జనవరి 9)న బెంగళూరు చేరుకోనుంది. ఈ ప్రయాణంలో మొత్తం 16 వేల కిలోమీటర్లు ఈ బృందం పయనిస్తుంది. ఉత్తర ధృవం మీదుగా విమానాన్ని నడపడం ఎంతో సవాలుతో కూడుకున్న విషయం. ఈ మార్గంలో వైమానిక సంస్థలు సహజంగా ఎంతో అనుభవం ఉన్న, అత్యుత్తమ పైలట్లనే పంపుతారు.

ఈ సారి ఎయిర్‌ఇండియా ఈ బాధ్యతను ఒక మహిళా పైలట్‌కు అప్పగించింది. ఈ విమానాన్ని ఎయిర్‌ ఇండియా మహిళా కెప్టెన్‌ జోయా అగర్వాల్‌ నాయకత్వంలోని మహిళా పైలట్ల బృందం నడుపుతోంది. ‘పౌర విమానయాన శాఖ, ఎయిర్‌ ఇండియా నాపై ఉంచిన నమ్మకాన్ని, బాధ్యతను ఎంతో గౌరవంగా భావిస్తున్నా. ఉత్తర ధృవం మీదుగా అత్యంత సుదూర మార్గంలో బోయింగ్‌ 777 విమానాన్ని నడిపే అద్భుత అవకాశం నాకు లభించింది’అని జోయా అగర్వాల్‌ పేర్కొన్నారు. తన్మయి పాపగిరి, ఆకాంక్ష సోనావానే, శివానీ మన్హాస్‌ వంటి అత్యంత అనుభవజ్ఞులైన మహిళా పైలట్ల బృందం తనకు సహకరిస్తోందని తెలిపారు.

మరిన్ని వార్తలు