Pet Dog Fly: పెట్‌ డాగ్‌ కోసం విమానంలోని బిజినెస్‌ క్లాస్‌ సీట్లన్ని..

23 Sep, 2021 19:57 IST|Sakshi

ఇంట్లో పెంపుడు జంతువులంటే చాలా వరకు కుక్కనే పెంచుకుంటారు. ఇక కొందరైతే వాటిని జంతువుల్లా కాకుండా తమ సొంత మనుషుల్లా ట్రీట్‌ చే​స్తుంటారు. మరో రకంగా చెప్పాలంటే కుక్కలు మనుషులకు మం‍చి నేస్తాలు అంటారు. అందుకే కొందరు ఖర్చు ఎక్కువైనా విదేశి జాతి కుక్కలను ప్రత్యేకంగా దిగుమతి చేసుకుని మరీ పెంచుకుంటారు. తాజాగా ఓ మహిళ తన పెట్‌ డాగ్‌ కోసం ఏకంగా విమానంలోని బిజినెస్‌ క్లాస్‌ మొత్తం బుక్‌ చేసింది. ఇలా మొత్తం బిజినెస్ క్లాస్ క్యాబిన్ లగ్జరీలో ఓ పెంపుడు జంతువు ప్రయాణించడం కోసం బుక్ చేసిన మొదటి సందర్భం కూడా ఇదే.

వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన ఓ మ‌హిళ‌.. త‌న పెంపుడు కుక్క మాల్టెస్ విమాన ప్ర‌యాణం కోసం ఎయిర్ ఇండియా విమానంలోని బిజినెస్ క్లాస్ టికెట్లన్నీ కొనేసింది. అందుకోసం ఆమె ఏకంగా 2.5 ల‌క్ష‌ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసింది. బిజినెస్ క్లాస్‌లో ముంబై నుంచి చెన్నై వ‌ర‌కు వీఐపీలా మాల్టెస్‌ ఒక్క‌టే ప్ర‌యాణించిన లక్కీ డాగ్‌ అనే చెప్పాలి. ఆ విమానంలో ఒక బిజినెస్ క్లాస్ సీటు కోసం వన్-వే ఛార్జీ సుమారు రూ. 20,000 ఉంటుంది. 

ఆ పెట్‌ డాగ్‌ గత బుధవారం ఉదయం 9 గంటలకు ఎయిర్ ఇండియా విమానం ఏఐ-671 ముంబై నుంచి బయలుదేరి 10.55 గంటలకు చెన్నైకు చేరింది. అయితే.. ఎయిర్ఇండియా పాల‌సీ ప్ర‌కారం.. వారి విమానాల్లో జంతువుల‌కు అనుమ‌తి ఉంది. ఒక ప్రయాణీకుడు రెండు పెంపుడు జంతువులతో ప్రయాణించే వెసలుబాటు ఉంది.  జంతువుల పరిమాణం ఆధారంగా, వాటిని క్యాబిన్‌లో లేదా కార్గో హోల్డ్‌లో ఉంచవచ్చు. అయితే బిజినెస్ క్లాస్‌లో, పెంపుడు జంతువులు చివరి వరుసలో కూర్చుంటాయి. ప్రయాణీకుల క్యాబిన్‌లో పెంపుడు జంతువులను అనుమతించే ఏకైక దేశీయ క్యారియర్ ఎయిర్ ఇండియా. 

మరిన్ని వార్తలు