Urination incident: ‘ఎయిరిండియా’ నిందితుని అరెస్టు

8 Jan, 2023 05:21 IST|Sakshi

బెంగళూరులో పట్టుకున్న ఢిల్లీ పోలీసులు

రెండు వారాల రిమాండ్‌

బాధిత మహిళకు ఎయిరిండియా క్షమాపణ

న్యూఢిల్లీ: ఎయిరిండియా విమానంలో తోటి ప్రయాణికురాలిపై మూత్రం పోసిన ఘటనలో నిందితుడు శంకర్‌ మిశ్రాకు ఢిల్లీ న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. న్యూయార్క్‌ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిరిండియా విమానంలో నవంబర్‌ 26వ తేదీన ఈ ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. నిందితుడు ఉద్దేశపూర్వకంగానే పోలీసు విచారణకు సహకరించడం లేదని తెలుస్తోందని మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ అనామిక పేర్కొన్నారు.

ఘటన సమయంలో విమాన సిబ్బంది, కొందరు ప్రయాణికులు నిందితుడిని గుర్తించాల్సి ఉన్నందున శంకర్‌ మిశ్రాను మూడు రోజుల కస్టడీకి అప్పగించాలన్న పోలీసుల వినతిని మేజిస్ట్రేట్‌ తోసిపుచ్చారు. ప్రజల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయనే కారణంతో కస్టడీకి కోరడం తగదన్నారు. నిందితుడి పరోక్షంలో విమాన ప్రయాణికులు, సిబ్బంది వాంగ్మూలం నమోదు చేస్తే సరిపోతుందన్నారు.

ఢిల్లీ నుంచి బెంగళూరుకు..
అంతకుముందు మిశ్రా కోసం ఢిల్లీ పోలీసులు లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. మొబైల్‌ ఫోన్‌ చివరి లొకేషన్‌ జనవరి 3న బెంగళూరుగా చూపించింది. స్నేహితులతో సోషల్‌ మీడియా ద్వారా అతను టచ్‌లో ఉన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. శుక్రవారం రాత్రి బెంగళూరు మహదేవపురలోని చిన్నప్ప లేఔట్‌లో అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలించారు.

బాధితురాలిని ఇబ్బందులకు గురిచేశారు
ఈ ఘటనలో ఎయిరిండియా సిబ్బంది బాధ్యతా రాహిత్యాన్ని బాధితురాలి పక్క సీట్లో ప్రయాణించిన డాక్టర్‌ సుగతా భట్టాచార్య వెల్లడించారు. ‘‘మిశ్రా నిర్వాకానికి బాధితురాలి దుస్తులు, సీటు పూర్తిగా తడిచి దుర్వాసన వెదజల్లుతున్నా మరో సీటు కేటాయించకుండా పైలట్‌ ఆమెను రెండు గంటలపాటు ఇబ్బందిపెట్టారు. ఫస్ట్‌క్లాస్‌లో నాలుగు సీట్లు ఖాళీగా ఉన్నా వెంటనే సిబ్బంది సీటివ్వలేదు. ఆ ఘటనతో మేమంతా షాకయ్యాం’’ అంటూ లిఖితపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. బా ధితురాలికి ఎయిరిండియా సీఈవో కాంప్‌బెల్‌ వి ల్సన్‌ క్షమాపణలు చెప్పారు. ‘‘సిబ్బంది సరిగా వ్య వహరించాల్సింది. పైలట్‌తో పాటు నలుగురికి షో కాజ్‌ నోటీసులిచ్చాం. విమానంలో ప్రయాణికులకు మందు సరఫరా చేయడాన్ని సమీక్షిస్తాం’’అన్నారు.

మరిన్ని వార్తలు