షాకింగ్‌ వీడియో: వృద్ధుల మీద డౌట్‌.. బూట్లు, పట్టు చీరల్లో నోట్ల కట్టలు.. పోలీసులు షాక్‌

3 Nov, 2022 16:51 IST|Sakshi

ముంబై: అక్రమంగా విదేశీ కరెన్సీ రవాణా చేస్తున్న ఓ కుటుంబం.. ముంబై పోలీసులను షాక్‌కి గురి చేసింది. ఏకంగా దాదాపు ఐదు లక్షల డాలర్ల నగదును గుట్టుచప్పుడు కాకుండా రవాణా చేసే ప్రయత్నం చేసింది. అయితే.. ముందుగా సమాచారం అందుకున్న పోలీసులు అనుమానంతో వెతకగా.. ఆ కుటుంబం నుంచి నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఈ ఘటన చోటు చేసుకోగా.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని అరెస్ట్‌ చేశారు ముంబై పోలీసులు. 

విదేశీ కరెన్సీ అక్రమ రవాణా గురించి ఎయిర్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌(AIU)కు ముందుగానే సమాచారం అందింది. దీంతో బుధవారం అర్ధరాత్రి నుంచే ముంబై ఎయిర్‌పోర్ట్‌ కస్టమ్స్‌ అధికారులు, ఏఐయూ సంయుక్తంగా ఆపరేషన్‌ చేపట్టాయి.  గురువారం ఉదయం ముంబై ఛత్రపది శివాజీ మహరాజ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఓ కుటుంబం కదలికలపై అధికారులకు అనుమానం వచ్చింది. ఇద్దరు వృద్ధులతో సహా ముగ్గురు ఉన్న ఆ కుటుంబం లగేజీని అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

వాళ్ల సూట్‌కేసులో ఉన్న షూస్‌ లోపల, పట్టుచీరల మధ్య అమెరికన్‌ డాలర్లు ప్రత్యక్షం కావడంతో కంగుతిన్నారు. మొత్తం అమెరికన్‌ డాలర్‌ కరెన్సీ విలువ 4,97,000 డాలర్లుకాగా, మన కరెన్సీలో దాని విలువ రూ.4.10 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఆ ముగ్గురిని అరెస్ట్‌ చేసి మెజిస్ట్రేట్‌ కోర్టులో ప్రవేశపెట్టగా.. 14 రోజుల జ్యూడిషియల్‌ కస్టడీ విధించారు జడ్జి. ఇంత డబ్బు ఎక్కడిది? ఎలా చేతులు మారింది? అనే విషయాన్ని తేల్చే పనిలో ఉన్నారు అధికారులు.

మరిన్ని వార్తలు