ఫ్లైట్‌ దిగారు.. పత్తా లేరు

29 Dec, 2020 10:45 IST|Sakshi

సాక్షి, బనశంకరి: బ్రిటన్‌లో కొత్త రకం కరోనా గుబులు నెలకొన్న తరుణంలో ఆ దేశంతో పాటు విదేశాల నుంచి బెంగళూరుకు చేరుకున్నవారిలో చాలా మంది అడ్రస్‌ లేరు. కరోనా పర్యవేక్షణ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. బ్రిటన్‌ నుంచి రాష్ట్రానికి వచ్చిన 1,614 మందిలో 26 మందికి కరోనా పాజిటివ్‌ అని వెల్లడైందని వైద్య ఆరోగ్య మంత్రి సుధాకర్‌ తెలిపారు. ఆయన సోమవారం విధానసౌధలో విలేకరులతో మాట్లాడారు. బ్రిటన్‌ నుంచి వచ్చిన వారికి నిమ్హాన్స్‌లో ఆరోగ్య పరీక్షలను నిర్వహించి కేంద్రానికి నివేదిక పంపించామన్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారికి ప్రభుత్వ ఆధ్వర్యంలో చికిత్స అందిస్తున్నామని, వీరిలో కరోనా స్ట్రెయిన్‌ తరహా కొత్తరకం లక్షణాలు కనబడలేదని, ఎవరూ హోం క్వారంటైన్‌లో లేరని చెప్పారు.

విదేశాల నుంచి వచ్చిన వారిలో చాలామంది ఆచూకీ లభించలేదని, అందులో బ్రిటన్‌ నుంచి వచ్చినవారు ఉన్నారని, చాలామంది మొబైల్‌ స్విచ్చాఫ్‌ చేసుకున్నారని, వారి ఆచూకీ కనిపెడుతున్నామని తెలిపారు. పోలీసుల సహాయంతో వారి జాడను కనిపెట్టడానికి హోంమంత్రి బొమ్మైతో చర్చించామని, రెండురోజుల్లోగా వారి ఆచూకీ కనిపెడతామన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన నివేదికలను ఐసీఎంఆర్‌ పరీక్షించి వైరస్‌ రకంపై ప్రకటన చేస్తుందన్నారు. కొత్త ఏడాదిని నిరాడంబరంగా ఆచరించాలని విజ్ఞప్తి చేశారు.  

మంగళూరు వచ్చిన  కేరళ విద్యార్థులకు కోవిడ్‌ 
తీర నగరంలో కోవిడ్‌ కలకలం చెలరేగింది. కేరళ నుంచి మంగళూరుకు వచ్చిన 15 నర్సింగ్‌ విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ అని తెలిసింది. జనవరి 1 నుంచి మంగళూరులో కాలేజీలు ప్రారంభం అవుతుండడంతో కేరళ నుంచి వచ్చిన 613 విద్యార్థులు మంగళూరు సిటి నర్సింగ్, రుక్మిణి శెట్టి నర్సింగ్‌ కాలేజీలకు చేరుకున్నారు. ఆరోగ్య శాఖ సిబ్బంది టెస్టులు చేయగా వీరిలో 15 మందికి పాజిటివ్‌ అని తెలిసింది.

613 మందిలో 200 మందికి మాత్రమే కరోనా టెస్ట్‌లు చేశారు. మిగతావారికీ కూడా జరిపితే మరిన్ని పాజిటివ్‌లు వచ్చే అవకాశముందని భయపడుతున్నారు. 15 మంది బాధితులకు హాస్టల్‌లో ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. వీరికి వచ్చింది మామూలు కోవిడా, లేక స్ట్రెయిన్‌ రకమా అనేది తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కోవిడ్‌ మార్గదర్శకాలను పాటించలేదని ఈ రెండు నర్సింగ్‌ కాలేజీలకు ప్రభుత్వం షోకాజ్‌ నోటీస్‌లు జారీచేసింది.    

మరిన్ని వార్తలు