మూతపడిన ఢిల్లీ విద్యాసంస్థలు.. మళ్లీ ఆన్‌లైన్‌ క్లాసులు!!

3 Dec, 2021 16:22 IST|Sakshi

Delhi NCR Air Pollution latest news in Telugu సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వాయు కాయులష్యం తీవ్రస్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో అన్ని విద్యాసంస్థలను మూసివేయవల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ఎయిర్‌ క్వాలిటీ ప్యానెల్‌ సూచనల మేరకు శుక్రవారం ఈ నిర్ణయం తీసుకుంది. దీనితో ఢిల్లీలోని అన్ని ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్లలోని ఆఫ్‌లైన్‌ క్లాసులన్నీ రద్దుచేయబడ్డాయి.

అంతేకాకుండా సుప్రీంకోర్టు కూడా ఈ విషయంతో మరింత కఠినంగా వ్యవహరించింది. వాయుకాలుష్యం కారణంగా ఉద్యోగులందరికీ వర్క్‌ ఫ్రం హోమ్‌ ఇచ్చారు. మరి విద్యార్ధులు మాత్రం స్కూళ్లకు ఎందుకు వెళ్లాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం దేశ రాజధానిలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయవల్సిందిగా ఆదేశించింది. ఆన్‌లైన్‌లో మాత్రమే తరగతులు నిర్వహించవల్సిందిగా సూచించింది. ఐతే పరీక్షలు, ప్రాక్టికల్స్‌ నిర్వహణకు విద్యాసంస్థలను తెరవచ్చని కూడా పేర్కొంది.

కాగా బుధవారం ఢిల్లీ వాయు నాణ్యత మరింత క్షీణించింది. గురువారం నాటికి పరిస్థితి ఇంకా అద్వాన్నంగా మారింది. సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు నివేదికల ప్రకారం.. ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌లో బుధవారం ఢిల్లీ వాయునాణ్యత 370గా నమోదుకాగా, గురువారం ఉదయం 7 గంటల సమయంలో 416గా చూపించింది. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం ఆఫ్‌లైన్‌ క్లాసులన్నింటినీ రద్దు చేసింది.

చదవండి: Nepal: అన్నా ఏందిది..! అదేమన్నా ట్రక్కను కున్నావా..? తోసుకెళ్తున్నారు..

మరిన్ని వార్తలు