విమానం కిలోమీటరు మేర రన్‌వేను తాకింది: డీజీసీఏ

8 Aug, 2020 16:08 IST|Sakshi

తిరువనంతపురం: కేరళలోని కోళీకోడ్‌ విమానాశ్రయంలో శుక్రవారం రాత్రి ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ప్రమాదానికి ముందు విమానం టేబుల్‌టాప్‌ ఎయిర్‌పోర్టులోని రన్‌వేను ఒక కిలోమీటరు మేర తాకినట్లు రెగ్యులేటర్‌ డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ) వర్గాలు వెల్లడించాయి. బోయింగ్‌ 737 ఎన్‌జీ విమానం రన్‌వేపై ఆగడానికి ముందు పట్టుతప్పిందని.. దాంతో నిటారుగా పడిపోయి రెండు ముక్కలయ్యిందని డీజీసీఏ తెలిపింది. అప్పటికే విమానం ల్యాండ్‌ అవ్వడానికి పలుమార్లు ప్రయత్నించిందని.. కానీ అందుకు వీలుపడలేదని తెలిపింది. అంతేకాక నిన్న విమానాశ్రయ ప్రాంతంలోనే కాక కేరళలోని పలు చోట్ల వర్షం కురిసిందని వెల్లడించింది. పౌర విమాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ మాట్లాడుతూ.. డైవర్షన్‌ ల్యాండింగ్‌కు సరిపడా ఇంధనం విమానంలో ఉందని వెల్లడించారు. (‘ఆ రన్‌వేకు ఎక్స్‌టెన్షన్‌ అవసరం ఉంది’)

దుబాయ్ నుంచి కేరళలోని కోళీకోడ్ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో 191 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో 18 మంది మరణించగా.. వీరిలో ఇద్దరు పైలెట్లు ఉన్నారు. అయితే అదృష్టవశాత్తు విమానంలో మంటలు చెలరేగకపోవడంతో ప్రాణనష్టం తక్కువగా ఉందని అధికారలు తెలిపారు. కోళీకోడ్‌ విమానాశ్రయం రన్‌వే కండిషన్‌పై వస్తోన్న విమర్శలను జూనియర్‌ విదేశాంగ శాఖ మంత్రి వి మురళీధరన్‌ ఖండించారు. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడం కోసం ఉద్దేశించిన ‘వందే భారత్‌ మిషన్’‌లో భాగంగా మే 7 నుంచి దాదాపు 100 విమానాలు కోళీకోడ్‌ విమానాశ్రయంలో ల్యాండ్‌ అయ్యాయని తెలిపారు. (విమాన ప్రమాదానికి కారణం ఇదేనా!)

అంతేకాక రన్‌ వే పరిస్థితి గురించి ఇంతకుముందు వచ్చిన నివేదికలకు నిన్న జరిగిన సంఘటనతో ఎలాంటి సంబంధం లేదని నిన్ననే పౌర విమానయాన మంత్రి స్పష్టం చేశారని మురళీధరన్‌ తెలిపారు. ప్రస్తుతం దక్షిణ భారతంలో రెండు టేబుల్‌టాప్ విమానాశ్రయాలు(కోళీకోడ్‌, మంగళూరు) ఉన్నాయన్నారు. అయితే వాటిని వినియోగించాలా వద్దా అన్నది చాలా పెద్ద ప్రశ్న అన్నారు మురళీధరన్‌.

టెబుల్‌టాప్‌ విమానశ్రాయం
టెబుల్‌టాప్‌ విమానాశ్రయం అనేది పీఠభూమి లేదా కొండను చదును చేసి ఏర్పాటు చేస్తారు. ఇక్కడ విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్‌ చేయడం ఎంతో సవాలుతో కూడుకున్న పని.

>
మరిన్ని వార్తలు