-

విషాదం : మృత్యువును ముందే పసిగట్టాడేమో? 

8 Aug, 2020 10:53 IST|Sakshi

"బ్యాక్ టు హోం'' అన్నవాడే.. మృత్యువు ఒడికి

పేదలకు సాయం చేయాలంటూ స్నేహితుని చేతికి కొంత డబ్బు

సాక్షి, తిరువనంతపురం: కేరళ కోళీకోడ్ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో మరణించిన షరాఫు పిలాసేరీ (35)విషాధ గాథ కంటి తడిపెట్టిస్తోంది. ముద్దులొలికే చిన్నారి, భార్యతో కలిసి ఎంతో ఉద్వేగంగా స్వదేశానికి బయలుదేరిన షరాఫు రాబోయే మృత్యువును ముందే ఊహించారా. ఆయన సిక్స్త్ సెన్స్ ఇలాంటి వార్నింగ్ ఇచ్చిందా? షరాఫు ప్రాణ స్నేహితుడు ఈ అనుమానాల్నే వ్యక్తం చేశారు.  (రక్తమోడిన దృశ్యాలు, భీతిల్లిన చిన్నారులు)

కోళీకోడ్‌లోని కున్నమంగళానికి చెందిన షరాపు గల్ఫ్‌లో పని చేస్తున్నారు. కరోనా సంక్షోభంతో అత్యవసరంగా భార్య అమీనా షెరిన్, కుమార్తె ఇసా ఫాతిమాతో కలిసి స్వదేశానికి పయనమయ్యారు. ప్రోటోకాల్ ప్రకారం అన్ని రక్షణాత్మక చర్యలు తీసుకున్న ఈ యువ దంపతులు "బ్యాక్ టూ హోం'' అంటూ ఒక సెల్ఫీని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ విషయాన్ని తలచుకుని దుబాయ్ లో ఒక హోటల్ నడుపుతున్న షరాఫు స్నేహితుడు షఫీ పరక్కులం కన్నీటి పర్యంతమయ్యారు. ఇండియాకు వెళ్లేముందు తనను కలిసిన స్నేహితుడి జ్ఙాపకాలను సోషల్ మీడియా ద్వారా గుర్తు చేసుకున్నారు. (ఆయన ధైర్యమే కాపాడింది!)

"కేరళకు బయలుదేరే ముందు, వీడ్కోలు చెప్పడానికి నా హోటల్‌కు వచ్చాడు. కొంచెం కలతగా కనిపించాడు. ఎందుకో నాకు టెన్షన్ అనిపిస్తోంది..అన్నాడు. అంతేకాదు  ఈ  కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయమని, వారికి అన్న పెట్టాలంటూ కొంత డబ్బు కూడా ఇచ్చాడు. ఇదంతా గమనిస్తోంటే.. ప్రమాదాన్ని ముందే పసిగట్టాడా...ఇదొక సూచనా అని అనిపిస్తోంది'' అని ఫేస్ బుక్ పోస్ట్ లో ఆవేదన వ్యక్తం చేశారు. షరాఫు గతంలో మహమ్మారి సమయంలో కూడా పేదలకు డబ్బులిచ్చాడని ఆయన గుర్తు చేసుకున్నారు. ఏది ఏమైనా కన్నవారిని కలుసుకోవాలన్నకోరిక తీరకుండానే..తన పసిబిడ్డ బోసినవ్వులను శాశ్వతంగా  వీడి మృత్యువు ఒడికి చేరడం బంధువుల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. కాగా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్రమాదంలో షరాఫు బేబీ మెమోరియల్ ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారు. అతని భార్య అమీనా  ఆరోగ్య పరిస్థితి  స్థిరంగా ఉండగా, కుమార్తె  ప్రస్తుతం కోళీకోడ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది.

మరిన్ని వార్తలు