ఇక్కడ కూత పెడితే... అక్కడికి వినిపిస్తుంది!

26 Jun, 2021 10:53 IST|Sakshi

ఒక రైలు తన ప్రయాణం మొదలుపెట్టిందంటే... ఇక అది గమ్యం చేరడానికి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది? కొన్ని వందలు, వేల కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది? నీలగిరుల్లో ప్రయాణించే ఊటీ – మెట్టుపాలయం టాయ్‌ట్రైన్‌ కూడా యాభై కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అయితే... గట్టిగా పదిహేను కిలోమీటర్లు కూడా ప్రయాణించకనే గమ్యం చేరే రైలు మనదేశంలో ఉంది. ఈ రైలు పేరు ఐట్‌–కోంచ్‌– ఐట్‌ షటిల్‌. అత్యంత తక్కువ నిడివి ఉన్న రైలుమార్గం ఇదే. బయలుదేరిన తర్వాత 35 నిమిషాలకు గమ్యం చేరుతుంది. 

అందరూ టికెట్‌ కొంటారు!!
కోంచ్‌–ఐట్‌ మధ్య దూరం 13.68 కిలోమీటర్లు. ఈ కొద్ది దూరానికి ఒక రైలు... ఆ రైలు కోసం రైల్వే లైన్‌ వేయడమూ, ఒక స్టేషన్‌ కట్టడమూ జరిగింది. ఉత్తరప్రదేశ్, బుందేల్‌ఖండ్‌ లో ఉన్న గిరిజనులు తమ అటవీ ఉత్పత్తులను ఐట్‌లో మార్కెట్‌ చేసుకోవడం కోసం బ్రిటిష్‌ పాలకులు కోంచ్‌ నుంచి ఐట్‌ జంక్షన్‌ వరకు రైల్వేలైన్‌ వేశారు. కోంచ్‌లో స్టేషన్‌ కట్టారు. ఒక రైలును నడిపారు. మూడు పెట్టెలు మాత్రమే ఉండే ఈ రైలు తెల్లవారు జామున నాలుగున్నర నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు రోజులో నాలుగుసార్లు అటూ ఇటూ ప్రయాణిస్తుంది.

రోజుకు నాలుగైదు వందల మంది ప్రయాణిస్తారు. ఇందులో టికెట్‌ ఐదు రూపాయలు. గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఒకటుంది! ఇందులో ప్రయాణించే వాళ్లు ఎవరూ టికెట్‌ కొనకుండా రైలెక్కరు. ఇదంతా నిజాయితీ అనుకుంటే పొరపాటేనని స్థానికులే చమత్కరిస్తుంటారు. రైలు నష్టంలో నడిచే పరిస్థితి కనుక ఎదురైతే రైల్వే డిపార్ట్‌మెంట్‌ ఈ రైలును ఆపేస్తుందేమోననే భయంతోనేనంటారు వాళ్లు.         

మరిన్ని వార్తలు