Lakhimpur Kheri Violence: ‘ఒక్క ఆధారం చూపినా రాజీనామా చేస్తా’

6 Oct, 2021 11:13 IST|Sakshi

కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రా

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్‌ ఖేరిలో రైతు మరణాల ఘటనపై కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రా స్పందించారు. తన కుమారుడు ఆశిష్‌ మిశ్రా ఈ ఘటనలో ఉన్నట్లు ఒక్క ఆధారం చూపిన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. కారు అదుపు తప్పి రైతులపైకి దూసుకెళ్లిందని, ఈ ఘటన సమయంలో కారులో తన కుమారుడు లేడని అన్నారు. ఘటన తర్వాత కారుపై దాడిచేయడంతో డ్రైవర్‌ గాయపడ్డాడని తెలిపారు. లఖీమ్‌పూర్‌ ఖేరి ఘటనపై నిరాధార అరోపణలు చేస్తున్నారని అన్నారు. రైతులకు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు. బీజేపీ అధిష్టానం తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ​

చదవండి: రైతు మరణాలపై... రాజకీయ ఉద్రిక్తతలు 

ఆదివారం బన్‌బీర్‌పూర్‌ సందర్శనకు వచ్చిన యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, అజయ్‌ మిశ్రాలకు నల్లజెండాలతో శాంతియుతంగా రైతులు తెలిపిన నిరసన హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో నలుగురు రైతులతో సహా 9 మంది మృతి చెందారు. లఖీమ్‌పూర్‌ ఖేరీలో రైతుల పైనుంచి దూసుకెళ్లిన ఎస్‌యూవీ (మహీంద్రా థార్‌)లో కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రా అలియాస్‌ మోనూ ఉన్నాడని ఉత్తరప్రదేశ్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఆశిష్‌ మిశ్రాపై పోలీసులు హత్య, నేరపూరిత కుట్ర, నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపటం, అల్లర్లకు కారణం అవడం... తదితర కేసులు నమోదు చేశారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రా పేరులేదు. 

మరిన్ని వార్తలు