Mahant Narendra Giri: మహంత్‌ నరేంద్ర గిరి అనుమానాస్పద మృతి.. ప్రధాని సంతాపం

20 Sep, 2021 21:10 IST|Sakshi

అలహాబాద్‌: అఖిల భారతీయ అఖాడా పరిషత్‌ అధ్యక్షుడు మహంత్‌ నరేంద్ర గిరి సోమవారం ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం అలహాబాద్‌లోని బాగంభరీ మఠంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మఠంలో ఓ గెస్టుహౌస్‌లోని గదిలో ఉరికి వేలాడుతుండగా ఆయన శిష్యులు గుర్తించినట్లు ఐజీ కె.పి.సింగ్‌ చెప్పారు. ఘటనా స్థలంలో ఎనిమిది పేజీల సూసైడ్‌ నోట్‌ లభించినట్లు తెలిపారు. మానసికంగా కృంగిపోయానని, అందుకే తనువు చాలిస్తున్నట్లు ఆ లేఖలో నరేంద్ర గిరి రాశారని వెల్లడించారు. తన శిష్యుల్లోని ఆనంద్‌ గిరి, మరికొందరి తీరు పట్ల మనస్తాపానికి గురయ్యానంటూ అందులో ఉందని అన్నారు. ‘సమాధి’ గురించి రాశారని వివరించారు.

శిష్యులు నిర్వర్తించాల్సిన బాధ్యతలను సదరు సూసైడ్‌ నోట్‌లో ప్రస్తావించారని పేర్కొన్నారు. ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే ఇది ఆత్మహత్య అని తెలుస్తోందని చెప్పారు. పోస్టుమార్టం, ఫోరెన్సిక్‌ టెస్టుల నివేదిక అందిన తర్వాత పూర్తి స్పష్టత వస్తుందని తెలిపారు. నరేంద్ర గిరి అంత్యక్రియలపై అఖాడా పరిషత్‌ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. నరేంద్ర గిరి ఈ ఏడాది ఏప్రిల్‌లో కరోనా వైరస్‌ బారినపడ్డారు. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. ఆయన నిరంజనీ అఖాడాకు కూడా అధినేతగా వ్యవహరిస్తున్నారు.   చదవండి: రన్నింగ్‌ ట్రైన్‌ ఎక్కుతూ కింద పడిపోయిన మహిళ.. అదృష్టం బాగుండి..

సూసైడ్‌ నోట్‌లో నరేంద్ర గిరి ప్రస్తావించిన ఆనంద్‌ గిరి అనే శిష్యుడిని ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. గురూజీ ఆత్మహత్య చేసుకోలేదని, ఆయనతో 15 రోజుల క్రితం మాట్లాడానని, డబ్బు కోసం ఆయనను కొందరు వేధించారని, తనకు వ్యతిరేకంగా పెద్ద కుట్ర జరుగుతోందని, ఈ కుట్రలో పోలీసులు, ల్యాండ్‌ మాఫియా భాగస్వాములని, విచారణకు సహకరిస్తానని, తాను తప్పు చేసినట్లుగా తేలితే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని ఆనంద్‌ గిరి చెప్పాడు. దేశంలో సాధువులకు సంబంధించి అతిపెద్ద సంస్థ అఖిల భారతీయ అఖాడా పరిషత్‌. మహంత్‌ నరేంద్ర గిరి మరణం పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు.

చదవండి: కుటుంబం ఆత్మహత్య: అతని వివాహేతర సంబంధమే కారణమా?

మరిన్ని వార్తలు