దళితులు అవసరం లేదు!... దళిత ఓటు బ్యాంకే లక్ష్యం!

15 Jan, 2022 14:40 IST|Sakshi

అఖిలేష్ యాదవ్‌కు దళితులు అక్కర్లేదు, దళితుల ఓటు బ్యాంకు మాత్రమే కావాలి అని భీమ్ ఆర్మీ చీఫ్ ఆజాద్ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. సమాజ్‌ వాదీ పార్టీతో పొత్తు చర్చల అనంతరం మాట్లాడిన ఆజాద్.. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ప్రకటించారు. ఎస్పీతో పొత్తు చర్చలు విఫలమైన నేపథ్యంలో అఖిలేష్‌ యాదవ్‌పై మండిపడ్డారు ఆజాద్‌. అంతేకాదు ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న ఎన్నికల కోసం అఖిలేష్ యాదవ్ దళిత ఓటు బ్యాంకుపై దృష్టి సారించాడు  అని విమర్శించారు. పైగా అతను బహుజన సమాజ్ ప్రజలను కించపరిచాడని ఆరోపించారు.

తాను గత ఆరు నెలలుగా  యాదవ్‌తో అనేక చర్చలు నిర్వహించిన పొత్తు కుదరలేదని చెప్పారు. రాబోయే రాష్ట్ర ఎన్నికలలో సమాజవాదీ పార్టీ(ఎస్పీ) తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలను బలోపేతం చేయడానికి అఖిలేష్ యాదవ్ అనేక చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకున్నారనేది గమనార్హం. అయితే వెనుకబడిన తరగతులు, దళితులు తమకు సామాజిక న్యాయం చేస్తాడనే నమ్మకంతో యాదవ్‌కు మద్దతు ఇస్తున్నారని ఆజాద్ అన్నారు. కానీ అఖిలేష్‌ యాదవ్‌కి సామాజిక న్యాయం అంటే అర్థం కావడం లేదని, అది మాటలతో జరగదంటూ ఆజాద్‌ విమర్శించారు. దళితులపై జరుగుతున్న అఘాయిత్యాలపై యాదవ్‌ మౌనం వహిస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లాగా ప్రవర్తిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. అయితే ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో జరగనున్న సంగతి తెలసిందే.

(చదవండి: కంగనా రనౌత్ చెంపల కంటే సున్నితమైన రోడ్లు నిర్మిస్తాం!: ఇర్ఫాన్ అన్సారీ)
 

మరిన్ని వార్తలు