మెట్రో స్టేషన్‌ సూసైడ్‌ కేసు: అనాథలా బతకడం ఇష్టం లేకనే..

16 Apr, 2022 15:38 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అక్షర్‌ధామ్‌ మెట్రో సూసైడ్‌ కేసు.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. చెవిటి-మూగ అయితే ఆ యువతి మెట్రో స్టేషన్‌ నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌ అయ్యాయి. అయితే అదృష్టం కొద్దీ బతికింది అనుకునేలోపు.. చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసింది. జీవితం మీద ఆమెకు అంతలా విరక్తి కలగడానికి వెనక కారణాలు తెలిస్తే అయ్యో పాపం అనకమానరు.  

పాతికేళ్లకే జీవితాన్ని ముగించాల్సిన అవసరం ఏంటన్న కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులకు.. ఒక్కో విషయం తెలుస్తోంది. పంజాబ్‌ హోషియాపూర్‌కు చెందిన బాధితురాలు.. గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగించింది. అయితే ఆమె తల్లిదండ్రులు సహా ఇంట్లో వాళ్లంతా ఎప్పుడో మరణించారు. ప్రస్తుతం ఒక్క బామ్మ మాత్రమే బతికి ఉంది. ఆ పెద్దావిడ కూడా ఇవాళో రేపో అన్నట్లు ఉంది. ఈ తరుణంలో.. ఆవిడ కూడా చనిపోతే.. అనాథగా మిగిలిపోతానేమోనని ఆమె ఆందోళన చెందుతోంది.  

ఈ విషయమై చాలాకాలంగా ఆలోచిస్తూ డిప్రెషన్‌లో కూరుకుపోయిన ఆమె.. ఆఫీస్‌లోనూ ఎవరితో కలవకుండా ఒంటరిగా ఉంటోందని, కౌన్సెలింగ్‌ కోసం కూడా సహకరించలేదని ఆమెతో పని చేసిన కొలీగ్స్‌ చెప్పారు. ఇక ఒంటరితనం గురించి ఆలోచించి.. ఆలోచించి.. చివరకు ఈమధ్యే ఆ యువతి ఉద్యోగం కూడా మానేసిందట. ఆపై అనాథగా మిగిలిపోతానేమోనని ఆందోళనతో..  ఇలా తీవ్ర నిర్ణయం తీసుకుని ఉంటుందని పోలీసులు వెల్లడించారు. 

కాపాడే ప్రయత్నంలో.. 
నలభై అడుగుల ఎత్తు నుంచి దూకడంతో.. తీవ్రంగా గాయాలపాలై శుక్రవారం ఆమె మృతి చెందినట్లు లాల్‌ బహదూర్‌ శాస్త్రి ఆస్పత్రి వైద్యులు తెలిపారు. తూర్పు ఢిల్లీ అక్షరధామ్‌ మెట్రో స్టేషన్‌ బ్లూ లైన్‌ మెట్రో ప్లాట్‌ఫారం చివర నుంచి ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. అక్కడే ఉన్న సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది.. ఆమెను నిలువరించే ప్రయత్నం కూడా చేశారు. పైన ఒక బృందం ఆమెను బతిమాలి ఆత్మహత్య ప్రయత్నం విరమించే దిశగా కృషి చేయగా.. కింద మరో టీం దూకితే గనుక బ్లాంకెట్ సాయంతో ఆమెను పట్టేసుకోవాలని రెడీగా ఉన్నారు. ఈలోపు ఆమె దూకేయగా.. బ్లాంకెట్‌లో పట్టేసుకున్నారు. అయితే తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కన్నుమూసిందామె.

చదవండి: మెట్రో స్టేషన్‌పై నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం


మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

మరిన్ని వార్తలు