కేంద్రానికి మద్దతు తెలిపిన అక్షయ్‌ కుమార్‌

3 Feb, 2021 15:36 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో రైతులు నిర్విరామంగా నిరసనలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గణతంత్ర దినోత్సవం నాడు ఈ ఉద్యమం ఉద్రిక్తతగా మారగా రైతులు, పోలీసులు గాయపడ్డారు. ఇదిలా వుంటే ఈ ఉద్యమానికి దేశవ్యాప్తంగా పలువురు సెలబ్రిటీలు మద్దతు తెలుపుతుండగా కొందరు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ కేంద్రానికి మద్దతు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. (చదవండి: అగ్రి సెస్‌తో రాష్ట్రాలకు నష్టం)

"దేశ నిర్మాణంలో రైతులకు ముఖ్యమైన స్థానం ఉంది. వారి సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం అన్నిరకాలుగా ప్రయత్నిస్తోంది. ఏవేవో మాట్లాడి వారి మధ్య విభేదాలు సృష్టించి హైలెట్‌ అవాలని చూడటానికి బదులు ఇద్దరి మధ్య స్నేహపూర్వక తీర్మానాలు జరగాలని ఆశిద్దాం" అని అక్షయ్‌ పేర్కొన్నారు. దీనికి #IndiaTogether, #IndiaAgainstPropaganda అనే హ్యాష్‌ట్యాగ్‌లను జత చేశారు. అలాగే మరో ప్రముఖ హీరో అజయ్‌ దేవ్‌గణ్‌ సైతం భారత్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మకండని సూచించారు. ఇది మనందరం కలిసి కట్టుగా నిలబడాల్సిన సమయమని పేర్కొన్నారు.

కాగా దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఉద్యమానికి విదేశీ సెలబ్రిటీలు మద్దతు తెలుపుతున్న విషయం తెలిసిందే. పర్యావరణ పరిరక్షణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్‌ రైతుల ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ మేనకోడలు మీనా హారిస్‌, హాలీవుడ్‌ పాప్‌ స్టార్‌ రిహన్నా సైతం సోషల్‌ మీడియా వేదికగా రైతులకు సపోర్ట్‌ చేశారు. అయితే ఇక్కడి విషయాల గురించి పూర్తి అవగాహన లేకపోయినప్పటికీ దానిపై స్పందించి వార్తల్లో నిలవాలని చూస్తున్న ఫారిన్‌ సెలబ్రిటీలకు ధీటుగా బాలీవుడ్‌ నటులు రిప్లైలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఫారినర్ల కామెంట్లపై అటు కేంద్రం కూడా ధీటుగానే స్పందించింది. సమస్యపై అవగాహన లేకుండా స్పందించకండి అని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇప్పటికే రైతు ఆందోళనను కొందరు తప్పుదారి పట్టిస్తున్నారని, అందులో భాగంగానే జనవరి 26న హింసాత్మక ఘటనలు ఆవిష్కృతమయ్యాయని పేర్కొంది. (చదవండి: రైతులకు మద్దతుగా రిహన్నా, గ్రెటా థన్‌బర్గ్‌‌)

మరిన్ని వార్తలు