ఆ చట్టాలను రద్దు చేయాల్సిందే

3 Dec, 2020 04:18 IST|Sakshi

కొత్త వ్యవసాయ చట్టాలపై రైతుల స్పష్టీకరణ

ఢిల్లీ సరిహద్దులో పెరుగుతున్న నిరసనకారులు

నేడు కేంద్ర మంత్రులతో మరో విడత చర్చలు

న్యూఢిల్లీ/చండీగఢ్‌: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఉద్యమం కొనసాగుతోంది. ఢిల్లీలోకి ప్రవేశించే ప్రధాన మార్గాలను బుధవారం వరుసగా ఏడోరోజు రైతులు దిగ్బంధించారు. నిరసనల్లో పాల్గొంటున్న రైతుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కీలకమైన ఢిల్లీ–నోయిడా మార్గాన్ని అధికారులు మూసేశారు. ఢిల్లీ–హరియాణా మార్గంలోని సింఘు, టిక్రీల వద్ద ట్రాఫిక్‌ను నిలిపేశారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయడం సహా తమ డిమాండ్లను అంగీకరించేంతవరకు నిరసన కొనసాగుతుందని రైతు సంఘాలు పునరుద్ఘాటించాయి.

ప్రభుత్వంతో మరో విడత చర్చలను నేడు  రైతులు జరప నున్న విషయం తెలిసిందే. రైతుల నిరసనలను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. ఈ సూటు, బూటు సర్కారు హయాంలో రైతుల ఆదాయం సగమయిందన్నారు. మరోవైపు, రైతుల నిరసనలకు మద్దతుగా ఉత్తర భారతదేశం వ్యాప్తంగా రవాణా సేవలు నిలిపేస్తామని ఆల్‌ ఇండియా మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కాంగ్రెస్‌(ఏఐఎంటీసీ) హెచ్చరించింది. రైతుల డిమాండ్లను నెరవేర్చనట్లయితే డిసెంబర్‌ 8 నుంచి రవాణా సేవలు ఆగిపోతాయని స్పష్టం చేసింది.

రవాణా(కార్గో, ప్యాసెంజర్‌) సేవలందించే దాదాపు 95 లక్షల ట్రక్కు యజమానులు, సుమారు 50 లక్షల ట్యాక్సీ, బస్‌ ఆపరేటర్లకు, ఇతర సంబంధిత వర్గాలకు ఏఐఎంటీసీ ప్రాతినిధ్యం వహిస్తోంది. ‘రవాణా సేవలు నిలిచిపోతే ఆహారధాన్యాలు, కూరగాయలు, బంగాళాదుంపలు, ఉల్లిగడ్డలు, పాలు, పళ్లు, ఔషధాలు.. తదితర నిత్యావసరాల రవాణా ఆగిపోతుంది. ప్రస్తుతం యాపిల్‌ పళ్ల సీజన్‌ నడుస్తోంది. రవాణా నిలిచిపోతే అవి పాడైపోతాయి’ అని ఏఐఎంటీసీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రత్యేక సమావేశాలు పెట్టండి
వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేసేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేశాయి. డిమాండ్లను నెరవేర్చడంలో ఆలస్యం చేస్తే ఢిల్లీలోకి ప్రవేశించే ఇతర మార్గాలను కూడా దిగ్బంధిస్తామని హెచ్చరించాయి. గురువారం జరగనున్న చర్చల్లో తమ అభ్యంతరాలను పాయింట్లవారీగా వివరిస్తామన్నారు. హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన పంజాబ్‌ యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలను బుధవారం పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లు దూకి సీఎం నివాసం వైపు వెళ్తున్న కార్యకర్తలపై వాటర్‌ కెనాన్లను ప్రయోగించారు. పంజాబ్‌ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బరీందర్‌ ధిల్లాన్, పలువురు ఇతర నేతలను అదుపులోకి తీసుకున్నారు.  

మంత్రుల చర్చలు
ఢిల్లీలో రైతుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్, రైల్వే మంత్రి పియూష్‌ గోయల్‌ బుధవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కొత్త వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళనలను ఏ విధంగా తొలగించాలనే విషయంపై వారు చర్చించారు.
సింగూ సరిహద్దు వద్ద భారీ స్థాయిలో గుమిగూడిన రైతులు

మరిన్ని వార్తలు