Arpita Mukherjee: ఆ డబ్బంతా పార్థా ఛటర్జీదే

26 Jul, 2022 01:20 IST|Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఉద్యోగ నియామకాల స్కామ్‌ కేసు దర్యాప్తు వేళ తన ఇంట్లోంచి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు అంతా నాటి బెంగాల్‌ విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీదేనని నిందితురాలు, నటి అర్పితా ముఖర్జీ ఒప్పుకున్నారు. ఈడీ కస్టడీలో విచారణలో ఆమె ఈ విషయం వెల్లడించారు. ఉపాధ్యాయుల నియామక స్కామ్‌లో భాగంగా ఈడీ సోదాల్లో ఆర్పిత ఇంట్లో రూ.20 కోట్ల కరెన్సీ కట్టలను స్వాధీనం చేసుకోవడం తెల్సిందే. ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించిన లావాదేవీల కోసం వారు 12 నకిలీ సంస్థలను నడుపుతున్నట్లు ఈడీ ఉన్నతాధికారి వెల్లడించారు.

అర్పిత, పార్థా ఉమ్మడిగా ఒక ఆస్తిని కొనుగోలుచేయగా, సంబంధిత డాక్యుమెంట్‌ను ఈడీ స్వాధీనంచేసుకుంది. గ్రూప్‌ సీ, గ్రూప్‌ డీ తరగతి ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు, తుది ఫలితాలు, అపాయిమెంట్‌ లెటర్స్‌ తదితర పత్రాలూ అర్పిత ఫ్లాట్‌లో దొరికాయి. వెస్ట్‌ మేదినీపూర్‌ ఓ స్కూల్‌ పేరిట మంత్రి భారీ స్థాయిలో ఆస్తులు కూడబెట్టినట్లు ఈడీ ఆరోపిస్తోంది. కాగా, అనారోగ్యమంటూ ఆస్పత్రిలో చేరిన మంత్రి పరిస్థితి బాగానే ఉందని, ఆస్పత్రిలో చికిత్స అనవసరమని భువనేశ్వర్‌ ఎయిమ్స్‌    ప్రకటించింది. కాగా, మంత్రి, అర్పితలను ఆగస్ట్‌ మూడో తేదీ దాకా ఈడీ కస్టడీలోకి అప్పజెప్తూ ఈడీ కోర్టు ఆదేశాలిచ్చింది.

మరిన్ని వార్తలు