మీ అప్పుల కతేంది?.. కేంద్రాన్ని నిలదీత

20 Jul, 2022 01:09 IST|Sakshi
అఖిలపక్షంలో తెలుగు రాష్ట్రాల ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, కె.కేశవరావు, నామా 

కేంద్రాన్ని నిలదీసిన తెలంగాణ, రాష్ట్రాలు  

వేదికైన శ్రీలంక సంక్షోభంపై అఖిలపక్షం

సాక్షి, న్యూఢిల్లీ: శ్రీలంకలో రాజకీయ, ఆర్ధిక సంక్షోభంపై చర్చించేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం కాస్త అధికార బీజేపీ, బీజేపేతర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదానికి వేదికగా మారింది. శ్రీలంక ఆర్ధిక పరిస్థితులకు మితిమీరన అప్పులే కారణమన్న కేంద్రం, ఆ క్రమంలో పలు రాష్ట్రాలు చేస్తున్న అప్పులను ప్రస్తావించడం ఉద్రిక్తతకు దారి తీసింది. కేంద్రం తీరును బీజేపీయేతర పక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. శ్రీలంక సంక్షోభంపై చర్చకని పిలిచి రాష్ట్రాల అప్పులను చర్చకు పెడతారా అంటూ ధ్వజమెత్తాయి. ముందుగా కేంద్రం చేస్తున్న అప్పుల లెక్కలు చెప్పాలంటూ గట్టిగా నిలదీశాయి. దాంతో వాతావరణం వేడెక్కింది.

శ్రీలంక సంక్షోభంపై విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ అధ్యక్షతన మంగళవారం అఖిలపక్ష భేటీ నిర్వహించారు. కాంగ్రెస్, టీఎంసీ, టీఆర్‌ఎస్, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, డీఎంకే సహా అన్ని విపక్షాలు పాల్గొన్నాయి. శ్రీలంక ప్రస్తుత పరిస్థితులు, మనపై దాని ప్రభావం, లంకకు భారత సాయం తదితరాలపై జైశంకర్‌ వివరించారు. లంక ఆర్ధిక, రాజకీయ సంక్షోభానికి కారణాలు, పర్యావసానాలు, దివాలాకు కారణమైన అప్పులపై విదేశాంగ కార్యదర్శి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

పెరిగిన అప్పులతో తిప్పలు, ద్రవ్యోల్బణం తదితరాలను ప్రస్తావించారు. ఆ వెంటనే పలు రాష్ట్రాల అప్పులపై కేంద్రం ఆర్ధిక శాఖ కార్యదర్శి ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాలను ప్రస్తావించారు. బీజేపీయేతర పార్టీల పాలనలోని రాష్ట్రాల అప్పులనే ప్రస్తావించడంతో భేటీ ఒక్కసారిగా వేడెక్కింది. తెలంగాణ అప్పులను ప్రస్తావించడాన్ని టీఆర్‌ఎస్‌ ఉభయ సభాపక్ష నేతలు కె.కేశవరావు, నామా నాగేశ్వరరావు తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘భేటీ ఉద్దేశమేమిటి? మీరు మాట్లాడున్నదేమిటి?’’ అంటూ తూర్పారబట్టారు.

‘‘తెలంగాణ జీఎస్‌డీపీని 25 శాతంగా నిర్ణయిస్తే చేసిన అప్పులు 23 శాతం మాత్రమే. కేంద్రం మాత్రం 40 శాతంగా జీస్‌డీపీ నిర్ణయిస్తే ఏకంగా 60 శాతం అప్పులు చేసింది’’ అంటూ దుయ్యబట్టారు. దేశ అప్పులు 2013–14 దాకా రూ.57 లక్షల కోట్లుంటే మోదీ హయాంలో ఏకంగా మరో రూ.100 లక్షల కోట్లు అప్పులు చేశారు’’ అంటూ గణాంకాలు తీశారు. ముందు కేంద్రం చేసిన అప్పులపై మాట్లాడి ఆ తర్వాతే రాష్ట్రాల అప్పులను ప్రస్తావించాలన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉందని చెప్పారు. బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టే ధోరణితో కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఏపీ అప్పులను ప్రస్తావించడాన్ని వైఎస్సార్‌సీపీ లోక్‌సభా పక్ష నేత మిథున్‌రెడ్డి కూడా తీవ్రంగా తప్పుపట్టారు.

మరిన్ని వార్తలు