ప్రధాని అధ్యక్షతన జీ-20 సన్నాహక సమావేశం.. హాజరైన ఏపీ సీఎం జగన్‌

5 Dec, 2022 20:22 IST|Sakshi

Time 7:54 PM
ముగిసిన జీ-20 సన్నాహక సమావేశం
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్‌లో జరిగిన జీ–20 సన్నాహక సమావేశం ముగిసింది. సమావేశానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. భారత్‌ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్న జీ–20 సదస్సులో చర్చించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై సలహాలు, సూచనలను కేంద్ర ప్రభుత్వం స్వీకరించింది. జీ-20 సమావేశాల విజయవంతానికి సహకరించాలని ప్రధాని మోదీ కోరారు. సమావేశం అనంతరం రాష్ట్రపతి భవన్ నుంచి ఎయిర్ పోర్టుకి సీఎం జగన్‌ బయలుదేరారు. 

Time 5:17 PM
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్‌లో జీ–20 సన్నాహక సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. భారత్‌ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్న జీ–20 సదస్సులో చర్చించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై సలహాలు, సూచనలను కేంద్ర ప్రభుత్వం స్వీకరిస్తోంది.

Time 3:55 PM
సాక్షి, ఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. కాసేపట్లో ప్రధాని అధ్యక్షతన జరిగే జీ–20 సన్నాహక సమావేశానికి హాజరుకానున్నారు. 2023లో జీ–20 సదస్సును నిర్వహించే అవకాశం భారతదేశం దక్కించుకుంది. దానికి ఎజెండాను ఖరారు చేయడానికి దేశంలోని అన్ని పార్టీల నాయకులతో (అఖిల పక్షం) ప్రధాని నరేంద్రమోదీ సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నారు. మోదీ అధ్యక్షతన సోమవారం సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఈ సమావేశంలో సీఎం జగన్‌ పాల్గొంటారు.

భారత్‌ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్న జీ–20 సదస్సులో చర్చించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై సలహాలు, సూచనలను కేంద్ర ప్రభుత్వం స్వీకరించనుంది. సమావేశానికి దాదాపుగా 40 రాజకీయ పార్టీలకు చెందిన అధినేతల్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఆహ్వానించారు.

ఈ సమావేశానికి రావాలని గతంలోనే సీఎం జగన్‌కి ఆహ్వానం వచ్చినప్పటికీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తుండటం, ముందుగా ఖరారు చేసిన షెడ్యూల్‌ ఉండటంతో సీఎం వైఎస్‌ జగన్‌ ఢిల్లీకి వెళ్లే విషయం ఖరారు కాలేదు. అయితే కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ ఆదివారం ప్రత్యేకంగా ఫోన్‌ చేసి జీ 20 సమావేశానికి తప్పనిసరిగా రావాలని ఆహ్వానించారు. దీంతో సీఎం వైఎస్‌ జగన్‌ ముందుగా ఖరారైన షెడ్యూల్‌ను సర్దుబాటు చేసుకుని ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించారు.

సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు రాష్ట్రపతి భవన్‌లో సమావేశంలో సీఎం జగన్‌ పాల్గొంటారు. ఆ సమావేశం ముగిసిన వెంటనే మళ్లీ బయలుదేరి.. రాత్రి 10.30 సమయంలో విజయవాడ చేరుకుంటారు.

మరిన్ని వార్తలు