మందిరాలు తెరిచేందుకు గ్రీన్‌ సిగ్నల్‌.. భక్తులు ఆధార్‌ కార్డుతో పాటు..

12 Aug, 2021 18:18 IST|Sakshi

ఈ నెల 23 నుంచి భక్తులకు అనుమతి

ఆధార్‌ కార్డు, టీకా ధ్రువీకరణ పత్రం తప్పనిసరి

రాయగడ: కోవిడ్‌ కారణంగా మార్చి నెలలో మూసివేసిన మందిరాలు, ధార్మిక సంస్థలను తెరిచేందుకు రాయగడ జిల్లా యంత్రాంగం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కలెక్టర్‌ సరోజ్‌కుమార్‌ మిశ్రా అధ్యక్షతన బుధవారం ధార్మిక సంస్థల ప్రతినిధులు, మందిర కమిటీలతో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో కోవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టడంతో నిబంధనలు పాటిస్తూ ఆలయాలు తెరిచేందుకు ధార్మిక సంస్థలకు అనుమతిచ్చారు. మజ్జిగౌరీ మందిరానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఆలయ ట్రస్టీలు కోవిడ్‌ నిబంధనలు పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు.

భక్తులు ఆధార్‌ కార్డుతో పాటు కోవిడ్‌ టీకా వేసుకున్నట్లు ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని సూచించారు. లేనివారికి మందిరంలో ప్రవేశాలకు అనుమతించొద్దని సూచించారు. మందిర ప్రవేశ ద్వారం వద్ద శానిటైజర్‌ అందుబాటులో ఉంచాలని, ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించేలా మందిర సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. కనీసం ఒక డోస్‌ టీకా వేసుకున్న అర్చకులు, పూజారులు మాత్రమే పూజా కార్యక్రమాల్లో పాల్గొనేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో జిల్లాలోని పలు ఆలయాలు, మసీదులు, చర్చిలకు చెందిన ప్రతిని«ధులు పాల్గొన్నారు.

అనుమతిస్తే శుక్రవారం నుంచే.. 
జిల్లా అధికారులు అనుమతిస్తే శుక్రవారం నుంచే మజ్జిగౌరి మందిరం తెరిచేందుకు తమకు ఎటువంటి ఇబ్బంది లేదని మందిరం ట్రస్టీ రాయిసింగి బిడిక అన్నారు. ఇప్పటికే భక్తుల దర్శనాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. కోవిడ్‌ నిబంధనల మేరకు అన్ని చర్యలు చేపడతామని చెప్పారు.

నిబంధనల మేరకు భక్తులకు ప్రవేశం 
భువనేశ్వర్‌: ఈ నెల 23 నుంచి నగరంలోని అన్ని ఆలయాలు, ప్రార్థనా మందిరాలు, ధార్మిక కేంద్రాలు తెరచుకోనున్నాయి. కోవిడ్‌ నిబంధనలు మేరకు భక్తులను అనుమతించనున్నారు. ఈ మేరకు ఆయల కమిటీలు, ధార్మిక సంస్థల నిర్వాహకులకు నగరపాలక సంస్థ పలు మార్గదర్శకాలను జారీ చేసింది. భక్తులకు గర్భగుడి ప్రవేశానికి అనుమతి లేదు. ఫలపుష్పాదులు, దూపధీప నైవేధ్యాలు ఆలయం లోనికి అనుమతించరు.

భక్తులు, ఆయల సిబ్బంది తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలి. కనీసం 6 అడుగుల భౌతికదూరం పాటించాలి. ఒక విడతలో 25 మంది వ్యక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. అర్చుకులు, సేవాయత్‌లకు రెండు టీకా డోసులతో పాటు ఆర్టీపీసీఆర్‌ నెగిటివ్‌ రిపోర్టు తప్పనిసరి. స్థానిక లింగరాజ దేవస్థానంలో దర్శనాలపై ధర్మకర్త మండలి తుది నిర్ణయం తీసుకోనుంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు