బడ్జెట్‌ సెషన్‌కు సిద్ధం.. 30న అఖిలపక్ష భేటీ

20 Jan, 2021 12:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌ సమావేశాలు ఈనెల 29వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ఈనెల 30వ తేదీన నిర్వహిస్తున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ప్రకటించారు. కరోనా పొంచి ఉన్న నేపథ్యంలో వర్చువల్‌ విధానంలోనే ఈ సమావేశం నిర్వహించనున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆయా పార్టీల పార్లమెంటరీ నేతలకు ఆహ్వానించినట్లు తెలిపారు. 

సమావేశాలు సజావుగా జరిగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని ఈ సందర్భంగా మంత్రి జోషి విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభంగా ఉన్న శాసన వ్యవహారాలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రతిపక్షాలు సలహాలు ఇవ్వాలని కోరారు. ప్రతిపక్షాల నుంచి సూచనలు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈ బడ్జెట్‌ సమావేశాలు రెండు విడతలుగా జరగనున్నాయి. జనవరి 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 15 వరకు మొదటి విడత, మార్చి 8 నుంచి ఏప్రిల్‌ 8 వరకు రెండో విడతగా బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించనున్నారు.

ఈసారి పార్లమెంట్‌ సమావేశాల నిర్వహణ కొత్తగా ఉండనుంది. ఉదయం రాజ్యసభ కొనసాగితే లోక్‌సభ సాయంత్రం జరగనుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ మేరకు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం రోజు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగం చేయనున్నారు.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు