-

రావణుడి తలలు దహనం కాలేదని షోకాజ్‌ నోటీసులు, గుమస్తాపై వేటు

7 Oct, 2022 14:57 IST|Sakshi

చత్తీస్‌గఢ్‌: దసరా వేడుకల్లో చివరి రోజైన విజయదశమి నాడు రావణ దహనం నిర్వహించడం సర్వసాధారణం. అయితే, చత్తీస్‌గఢ్‌లోని ధామ్‌తరిలో మాత్రం రావణ దహనం కార్యక్రమం వైరల్‌గా మారింది. ఎందుకంటే రావణుడి పదితలలు కాలలేదు. కేవలం దిష్టిబొమ్మ కింద భాగం అంత బూడిదైపోయింది. దీంతో ఈ ఘటనపై ధామ్‌తరీ పౌర సంఘం సీరియస్‌ అయ్యి ఒక గుమస్తాని సస్పెండ్‌ చేసి కొంతమంది అధికారులకు షోకాజ్‌నోటీసులు కూడా జారీ చేసింది. ఈ మేరకు అక్టోబర్‌5న ధామ్‌తరిలో రామ్‌లీలా మైదాన్‌లో రాక్షసరాజు రావణుడి దహనం చేస్తున్నప్పుడూ ఈ వింత ఘటన చోటుచేసుకుంది.

అయితే, ఈ వేడుకల్లో రావణ దిష్టిబొమ్మ దహనాన్ని పర్యవేక్షిస్తోంది స్థానిక పౌరసంఘం. అంతేగాదు ధామ్‌తరి మున్సిపల్‌ కార్పొరేషన్ (డీఎంసీ) గుమస్తా రాజేంద్ర యాదవ్‌ రావణ దిష్టిబొమ్మ రూపొందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ సీరియస్‌ అయ్యి విధుల నుంచి బహిష్కరించింది. పైగా యాదవ్‌ రావణ దిష్టి బొమ్మను తయారుచేయడంలో మున్సిపల్‌ కార్పోరేషన్‌ ప్రతిష్టను కించపరిచేలా నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ మండిపడింది. అంతేగాదు ఆయన స్థానంలో సమర్థ రాణాసింగ్‌ అనే వ్యక్తిని నియమించినట్లు డీఎంసీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ రాజేష్‌ పద్మవర్‌ తెలిపారు.

ఈ ఘటన​కు సంబంధించి నలుగురు అధికారులు అసిస్టెంట్ ఇంజనీర్ విజయ్ మెహ్రా, సబ్ ఇంజనీర్లు లోమస్ దేవాంగన్, కమలేష్ ఠాకూర్, కమతా నాగేంద్రలపై డీఎంసీ షోకాజ్‌నోటీసులు జారీ చేసింది. దిష్టి బొమ్మను తయారు చేసే బాధ్యతలను అప్పగించిన వారిపై కూడా చర్యలు తీసుకుంటున్నామని, వారి వేతనాల చెల్లింపులు కూడా నిలిపేస్తున్నామని ధామ్‌తరి మేయర్‌ విజయ దేవగన్‌ అన్నారు. 
(చదవండి: గేదెలు ఢీకొట్టడంతో దెబ్బతిన్న వందే భారత్‌ రైలు.. 24 గంటల్లోనే రిపేర్‌)

మరిన్ని వార్తలు