పెళ్లితో సంబంధం లేదు.. అబార్షన్లపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు

30 Sep, 2022 07:35 IST|Sakshi

వివాహిత, అవివాహిత వ్యత్యాసం రాజ్యాంగవిరుద్ధం

అత్యాచారానికి గురైనట్టు రుజువు చేసుకునే అవసరం లేదు

కుటుంబీకుల అనుమతి, మైనర్ల వివరాల వెల్లడి అనవసరం

ఎంటీపీ చట్టం ప్రకారం రేప్‌ కిందికి వైవాహిక అత్యాచారం

సాక్షి, న్యూఢిల్లీ: గర్భధారణ, మాతృత్వపు హక్కుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. చట్టపరమైన సురక్షిత గర్భస్రావం మహిళలందరికీ సమానంగా వర్తించే హక్కేనని తేల్చిచెప్పింది. వివాహితులు, అవివాహితులు అంటూ తేడా చూపించడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. పెళ్లయిన వారితో సమానంగా అవివాహితులకు కూడా 24 వారాల్లోపు గర్భస్రావం చేయించుకునే హక్కు ఉంటుందని పేర్కొంది.

అంతేగాక వైవాహిక అత్యాచారాన్ని కూడా వైద్యపరమైన గర్భవిచ్ఛిత్తి (ఎంటీపీ) చట్ట నిర్వచనం ప్రకారం రేప్‌గానే పరిగణించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎంటీపీ చట్ట పరిధిని విస్తరిస్తూ న్యాయమూర్తులు జస్టిస్‌ చంద్రచూడ్, జస్టిస్‌ పార్డీవాలా, జస్టిస్‌ ఎ.ఎన్‌.బొపన్నలతో కూడిన ధర్మాసనం గురువారం చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. అంతర్జాతీయ సురక్షిత అబార్షన్‌ దినోత్సవం (సెప్టెంబర్‌ 28) మర్నాడే ఈ తీర్పు రావడం విశేషం.

కాలంతో పాటు చట్టాలూ మారాలి
వైద్యపరమైన గర్భవిచ్ఛిత్తి (ఎంటీపీ) చట్టం సెక్షన్‌ 3(2)(బీ)ప్రకారం వివాహితలతో పాటు అత్యాచార బాధితులు, మైనర్లు, మానసిక సమస్యలున్న వారు, పిండం సరిగా అభివృద్ధి చెందని సందర్భాల్లో 24 వారాల్లోపు గర్భస్రావం చేయించుకునే హక్కుంది. అవివాహితలు, వితంతువులు తమ ఇష్టం మేరకు గర్భం దాలిస్తే 20 వారాల వరకు మాత్రమే అబార్షన్‌కు అవకాశముంది. ఈ తేడాలు వివక్షేనని ధర్మాసనం పేర్కొంది.

చట్టాలు స్థిరంగా ఉండరాదని అభిప్రాయపడింది. వాటిని కాలానుగుణంగా మార్చుకోవాల్సిన అవసరముందని 75 పేజీల తీర్పులో పేర్కొంది. ‘‘ఎంపీటీ నిబంధనలను కూడా మెరుగుపరుచుకోవాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే పిల్లల్ని కనాలా, వద్దా అన్నది మహిళ హక్కు. ఆర్టికల్‌ 21 ప్రకారం ఆమెకున్న వ్యక్తిగత స్వేచ్ఛ. దీనికి వైవాహిక స్థితితో నిమిత్తం లేదు. సహజీవనాలను కూడా సుప్రీంకోర్టు ఇప్పటికే గుర్తించింది.

కనుక 24 వారాల్లోపు సురక్షిత అబార్షన్‌ హక్కును వివాహితలకే పరిమితం చేసి అవివాహితలకు, ఒంటరి మహిళలకు నిరాకరించడం వారి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడమే. చట్టానికి సంకుచిత భాష్యం చెప్పడమే. ఇందులో ఎలాంటి హేతుబద్ధతా లేదు’’అని స్పష్టం చేసింది. అంతర్జాతీయ సురక్షిత గర్భస్రావ దినం మర్నాడే తీర్పు వెలువడిందని ఒక లాయర్‌ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లగా ఇది యాదృచ్ఛికమని జస్టిస్‌ చంద్రచూడ్‌ అన్నారు.

వైవాహిక అత్యాచారానికి గురైనా అబార్షన్‌ చేయించుకోవచ్చు
వైవాహిక అత్యాచారాన్ని కూడా ఎంటీఐ చట్టానికి సంబంధించినంత వరకు అత్యాచారం పరిధిలోకి తేవాల్సి ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. ‘‘అత్యాచారమంటే మహిళ తన సమ్మతి లేకుండా లైంగిక సంపర్కంలో పాల్గొనాల్సి రావడం. అపరిచితులు మాత్రమే రేప్‌లకు, లైంగిక వేధింపులకు పాల్పడతారన్న అపోహ మనలో ఉంది. భర్త/జీవిత భాగస్వామి చేతిలో లైంగిక వేధింపులు చిరకాలంగా మహిళలు ఎదుర్కొంటున్న చేదు అనుభవాలే.

కాబట్టి దీన్ని కూడా అత్యాచారంగానే పరిగణిస్తూ, తద్వారా దాల్చే బలవంతపు గర్భం బారినుంచి మహిళలను కాపాడాల్సి ఉంది’’అని పేర్కొంది. సదరు మహిళకు కూడా ఎంటీపీ చట్టం సెక్షన్‌ 3(బి)(ఎ) ప్రకారం 24 వారాల్లోపు అబార్షన్‌ చేయించుకునే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. అయితే భర్త చేతుల్లో లైంగిక వేధింపులను, బలవంతపు లైంగిక సంపర్కాన్ని ఐపీసీ సెక్షన్‌ 375 ప్రకారం అత్యాచారంగా పరిగణించాలా, లేదా అన్నది మరో ధర్మాసనం విచారణలో ఉందని గుర్తు చేసింది. దీనిపై ఆ ధర్మాసనమే నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంది.

మైనర్ల పేరు వెల్లడించాల్సిన పని లేదు
ఎంటీపీ చట్టం ప్రకారం మైనర్లకు కూడా 20–24 వారాల వ్యవధిలో గర్భస్రావానికి అనుమతి ఉందని ధర్మాసనం పేర్కొంది. మైనర్‌కు అబార్షన్‌ చేయాల్సిన సందర్భంగా పోక్సో చట్టం మేరకు పోలీసు రిపోర్టు తప్పనిసరే అయినా బాధితురాలి పేరు, వ్యక్తిగత వివరాలను వైద్యులు తెలపాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. పోక్సో చట్టాన్ని సామరస్యపూర్వకంగా వర్తింపజేయాలని సూచించింది. ‘‘వివాహితలు మాత్రమే లైంగిక కార్యకలాపాల్లో పాల్గొంటారన్నది సరికాదు.

అవివాహితలు, మైనర్లు కూడా లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం, లేదా లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు గురవడం జరుగుతోంది. ఇవి కొన్నిసార్లు గర్భధారణకూ దారితీస్తున్న సత్యాన్ని విస్మరించలేం. దేశంలో సరైన లైంగిక ఆరోగ్య విద్య లేక చాలామందికి కౌమారదశలో పునరుత్పత్తి వ్యవస్థ, సురక్షిత లైంగిక పద్ధతులు, గర్భనిరోధక పరికరాలు, పద్ధతుల గురించి తెలియడం లేదు. ఈ సమాచారం అన్ని ప్రాంతాల్లోని ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలి.

ప్రతి జిల్లాలో వైద్య సదుపాయాలు, గుర్తింపు పొందిన వైద్యులు తప్పనిసరిగా ఉండాలి. కులం, సామాజిక, ఆర్థిక కారణాలతో చికిత్సను నిరాకరించరాదు’’అని ఆదేశించింది. ఇవన్నీ వాస్తవరూపం దాల్చినప్పుడు మాత్రమే మహిళల శారీరక స్వయంప్రతిపత్తి హక్కు సురక్షితంగా ఉంటుందని పేర్కొంది.

కుటుంబీకుల అనుమతీ అక్కర్లేదు
చట్టపరమైన అబార్షన్‌ చేయించుకోవడానికి మహిళలకు కుటుంబ సభ్యుల సమ్మతి అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది. కుటుంబ సభ్యుల సమ్మతి, డాక్యుమెంటరీ రుజువులు, న్యాయపరమైన అనుమతి అంటూ వైద్యులు చట్టానికి మించిన షరతులు పెడుతున్నారు. అవి లేవంటూ అబార్షన్‌కు నిరాకరిస్తున్నారు’’అంటూ ఆవేదన వెలిబుచ్చింది. ‘‘ఇది నిజంగా విచారకరం. ఆ కారణాలతో వైద్యులు అబార్షన్‌ నిరాకరించడానికి వీల్లేదు.

గర్భాన్ని తొలగించుకోవాలనుకునే మహిళ ఎంటీపీ చట్ట నిబంధనలను పాటించేలా చూసుకుంటే చాలు’’అని పేర్కొంది. ‘‘సదరు గర్భానికి భర్త/భాగస్వామి అంగీకారం ఉందా? పుట్టబోయే బిడ్డ బాధ్యతను వారు కూడా సమానంగా స్వీకరిస్తారా? గర్భధారణ, కాన్పు ఖర్చులను కుటుంబం భరిస్తుందా? ఇలాంటివన్నీ చాలా సంక్లిష్టమైన అంశాలు. సదరు మహిళకు మాత్రమే తెలిసే విషయాలు. కాబట్టి గర్భాన్ని ఉంచుకోవాలా, లేదా అన్నది నిర్ణయించుకోవాల్సింది కేవలం ఆమె మాత్రమే. అంతే తప్ప సంకుచిత పితృస్వామిక సూత్రాల ఆధారంగా చట్టం నిర్ణయించే పరిస్థితి ఉండకూడదు’’అని స్పష్టం చేసింది.

ఇదీ నేపథ్యం...
ఈశాన్య ప్రాంతానికి చెందిన ఓ 25 ఏళ్ల అవివాహితకు 23 వారాల 5 రోజుల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతివ్వాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తాను ఇష్టపడే గర్భం దాల్చినా ఆ తర్వాత భాగస్వామి పెళ్లికి నిరాకరించి తనను వదిలేశాడని పేర్కొంది. కానీ ఆమె గర్భానికి 20 వారాలు దాటినందున ఎంటీపీ చట్టం ప్రకారం అబార్షన్‌కు హైకోర్టు అనుమతి నిరాకరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ఆమె సుప్రీంకోర్టులో అపీలు చేసుకుంది.

అబార్షన్‌కు అనుమతిస్తూ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఎంటీపీ చట్టానికి 2021లో చేసిన సవరణ ద్వారా భర్త అనే పదాన్ని భాగస్వామిగా మార్చిన విషయాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని అభిప్రాయపడింది. తుది విచారణ జరిపి ఆగస్టు 23న వాదనలు ముగించింది. తాజాగా గురువారం తీర్పు వెలువరించింది.  

చట్టపరంగా సురక్షిత అబార్షన్‌ చేయించుకోవడానికి మహిళలందరూ అర్హులే. గర్భిణులు 20–24 వారాల మధ్య అబార్షన్‌ చేయించుకోవచ్చని గర్భవిచ్ఛిత్తి చట్టం సెక్షన్‌ 3(2)(బీ) చెబుతోంది. దీన్ని వివాహితులకే వర్తింపజేసి అవివాహితులను దూరం పెట్టడం ఆర్టికల్‌ 14ను ఉల్లంఘించడమే

స్త్రీకి తన శరీరంపై సంపూర్ణ హక్కుంటుంది. అవాంఛిత గర్భం ఆమె శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. కనుక పెళ్లయిందా, లేదా అనేదానితో నిమిత్తం లేకుండా అబార్షన్‌పై ఆమెదే అంతిమ నిర్ణయం. అత్యాచారానికి, లైంగిక వేధింపులకు గురైనట్టు నిరూపించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కుటుంబ సభ్యుల సమ్మతీ అవసరం లేదు. మైనర్, లేదా మానసిక వైకల్యమున్న వారికి మాత్రమే సంరక్షకుల సమ్మతి అవసరం . – జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ 

మరిన్ని వార్తలు