అర్ధరాత్రి అంత్యక్రియలు ఉల్లంఘనే

14 Oct, 2020 04:52 IST|Sakshi
ఘటనాస్థలి వద్ద బాధితురాలి కుటుంబీకులు

హాథ్రస్‌ బాధితురాలి దహనంపై అలహాబాద్‌ హైకోర్టు వ్యాఖ్యలు

బాధ్యులపై చర్యలకు ఆదేశాలు

లక్నో: హాథ్రస్‌ సామూహిక అత్యాచార బాధిత యువతి భౌతిక కాయాన్ని అర్థరాత్రి దహనంచేయడం మానవహక్కుల ఉల్లంఘన అని, అందుకు బాధ్యులైన వారిని గుర్తించి చర్యలు చేపట్టాలని అలహాబాద్‌ హైకోర్టు ఆదేశించింది. హాథ్రస్‌ లాంటి ఘటనల్లో శవ దహనానికి మార్గదర్శకాలను రూపొందించాలని హైకోర్టు లక్నో బెంచ్‌ రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. సాంప్రదాయాలను పాటించకుండా, అర్థరాత్రి శవాన్ని దహనం చేయడం బాధిత మహిళ మానవ హక్కులను, వారి కుటుంబ సభ్యులు, బంధువుల మానవ హక్కులను ఉల్లంఘించడమేనని అభిప్రాయపడింది.  

హాథ్రస్‌కు సీబీఐ బృందం
హాథ్రస్‌ హత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యులను మంగళవారం సీబీఐ ప్రశ్నించింది. నేరం జరిగిన ప్రాంతాన్ని సీబీఐ అధికారులు పరిశీలించారు. మంగళవారం ఉదయం హాథ్రస్‌ చేరుకున్న సీబీఐ బృందం మొదట బాధితురాలి సోదరుడి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఆ తరువాత, వారి కుటుంబం నుంచి పూర్తి వివరాలను సేకరించారు. సంఘటన పూర్వాపరాలపై వారిని లోతుగా ప్రశ్నించారు. మరోవైపు, హాథ్రస్‌ కేసు విచారణకు సీబీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందంలో మరో నలుగురు అధికారులు కొత్తగా చేరారు. సెంట్రల్‌ ఫొరెన్సిక్‌ సైన్స్‌ లాబ్‌ నుంచి కూడా నిపుణులు ఈ బృందంలో చేరారు. 

మరిన్ని వార్తలు