హత్రాస్ అత్యాచార ఘటనలో కీలక పరిణామం

2 Oct, 2020 09:05 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా నిరసనలకు కారణమైన ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ అత్యాచార ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాధితురాలిపై అత్యాచారం, ఆపై అర్థరాత్రి అంతిమ సంస్కారాలు నిర్వహించడంపై అలహాబాద్‌ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో బాధితురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యుల హక్కులు పోలీసులు, స్థానిక అధికారులు హరించినట్లు తమ దృష్టికి వచ్చిందని న్యాయస్థానం పేర్కొంది. ప్రజాగ్రహం ఉదృతమవుతున్న నేపథ్యంలో ఘటనపై వారికున్న సందేహాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత తమపై ఉందని వ్యాఖ్యానించింది. హత్రాస్‌ అత్యాచార ఘటన, తదనంతరం చోటుచేసుకున్న పరిణామాలను సుమోటో కేసుగా స్వీకరిస్తున్నట్లు అలహాబాద్‌ హైకోర్టు తెలిపింది. ఈ మేరకు సీనియర్లు న్యాయమూర్తులు జస్టిస్‌ రాజన్‌రాయ్‌‌, జస్ప్రిత్‌‌ సింగ్‌లతో కూడిని ద్విసభ్య ధర్మాసనం కేసు విచారణ చేపట్టనుంది. (అత్యాచారం జరగలేదు)

దీనిలో భాగంగానే ఈ నెల 12లోపు తమముందు హాజరుకావాలని స్థానిక పోలీసు అధికారులతో పాటు బాలిక అంత్యక్రియలు నిర్వహించిన ప్రతిఒక్కరికీ గురువారం రాత్రి నోటీసులు జారీచేసింది. ఈ ఘటనతో సంబంధముందని భావిస్తున్న ఉన్నాతాధికారులకు కూడా నోటీసులు పంపింది. ఈ సందర్భంగా న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘19 ఏళ్ల దళిత బాలికపై అత్యాచారానికి పాల్పడటం అత్యంత హేయమైన చర్య. ఆపై యువతి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా అర్థరాత్రి సమయంలో పోలీసులే అంతిమ సంస్కారాలు నిర్వహించడం ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. ఈ సమయంలో బాలికతోపాటు కుటుంబ సభ్యులకున్న ప్రాథమిక హక్కులను హరించినట్లు మా దృష్టికి వచ్చాయి. ఈ ఘటనలో గుర్తుతెలియని బలమైన వ్యక్తుల ప్రయేయం ఉన్నట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిజనిజాలను వెల్లడిస్తాం’ అని ధర్మాసనం పేర్కొంది. (హత్రస్‌ నిరసనలు: అది ఫేక్‌ ఫోటో!)

అంతేకాకుండా మృతులకు గౌరవప్రదమైన అంతిమ సంస్కారం వారి హక్కు అని పేర్కొన్న న్యాయస్థానం.. పర్మానంద్ కటారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, రాంజీ సింగ్ ముజీబ్ భాయి వర్సెస్ యూపీ ప్రభుత్వం, ప్రదీప్ గాంధీ వర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వ కేసులను ప్రస్తావించింది. ఈ హక్కులు ఉల్లంఘన జరిగినట్లు తమ విచారణలో తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. మరోవైపు బాధిత యువతిపై అత్యాచారం జరగలేదని యూపీ పోలీసులు ప్రకటించడంతో వివాదం మరింత చెలరేగుతోంది.

ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నివేదికలో కూడా అదే విషయం స్పష్టమైందని గురువారం యూపీ ఏడీజీ ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు. మెడపై అయిన తీవ్రస్థాయి గాయం కారణంగా ఆమె చనిపోయిందన్నారు. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ రిపోర్ట్‌ వచ్చిందని, అత్యాచారం కానీ, గ్యాంగ్‌ రేప్‌ కానీ జరగలేదని అందులో స్పష్టంగా ఉందని వెల్లడించారు. ఆయన ప్రకటనపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. కేసు నుంచి దోషులను తప్పించడానికి యోగి ఆదిత్యానాథ్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నాయి. అయితే, నలుగురు నిందితులు సందీప్, రాము, లవ్‌కుశ్, రవి తనను గ్యాంగ్‌ రేప్‌ చేశారని బాధిత యువతి వాంగ్మూలం ఇచ్చినట్లు గతంలో ఎస్పీ విక్రాంత్‌ వీర్‌ వెల్లడించడం గమనార్హం. వారంకూడా గడవకముందే రిపోర్టును మార్చడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తన స్టేట్‌మెంట్‌ను మార్చుకోవాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని, పోలీస్‌ స్టేషన్‌కు బలవంతంగా తీసుకువెళ్లి, తనతో పాటు తన కుటుంబ సభ్యులతో కొన్ని కాగితాలపై సంతకాలు తీసుకున్నారని బాలిక తం‍డ్రి ఆరోపిస్తున్నారు.

మరిన్ని వార్తలు