అనిల్‌ దేశ్‌ముఖ్‌పై నేడు నిర్ణయం

22 Mar, 2021 05:22 IST|Sakshi

హోం మంత్రిగా కొనసాగించడంపై సీఎం ఠాక్రే నిర్ణయం తీసుకుంటారు

మహా వికాస్‌ అఘాడీపై ప్రభావం ఉండదు

ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ వ్యాఖ్య

ముంబై/న్యూఢిల్లీ: మహారాష్ట్ర హోంమంత్రి, ఎన్సీపీ నాయకుడు అనిల్‌ దేశ్‌ముఖ్‌పై ముంబై మాజీ పోలీస్‌ చీఫ్‌ పరమ్‌వీర్‌ సింగ్‌ చేసిన అవినీతి ఆరోపణల రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఈ ఆరోపణలకు సంబంధించి నష్టనివారణ చర్యల కోసం ఎన్సీపీ అధినేత, సీనియర్‌ రాజకీయ నాయకుడు శరద్‌ పవార్‌ రంగంలోకి దిగారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల సంకీర్ణ ప్రభుత్వం ‘మహావికాస్‌ ఆఘాడీ(ఎంవీఏ)’పై ఈ ఆరోపణలు ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపబోవని పవార్‌ ఆదివారం పేర్కొన్నారు.

హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ను ప్రభుత్వంలో కొనసాగించే విషయమై ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే సోమవారం నిర్ణయం తీసుకుంటారన్నారు. అనిల్‌ దేశ్‌ముఖ్‌పై పరమ్‌వీర్‌ సింగ్‌ చేసిన ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని పవార్‌ అంగీకరించారు. ఆ ఆరోపణలపై లోతైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయమై సీఎం ఠాక్రేతో మాట్లాడానన్నారు. పరమ్‌వీర్‌ సింగ్‌ చేసిన ఆరోపణలపై దర్యాప్తునకు సంబంధించి మాజీ ఐపీఎస్‌ అధికారి జూలియొ రిబీరరో సహకారం తీసుకుంటే బావుంటుందని  భావిస్తున్నానన్నారు. దేశ్‌ముఖ్‌కు సంబంధించి తాము సోమవారం వరకు నిర్ణయం తీసుకుంటామని, నిర్ణయం తీసుకునేముందు, ఆ ఆరోపణలకు సంబంధించి ఆయన వాదన కూడా వినాల్సి ఉంటుందని పవార్‌ వ్యాఖ్యానించారు. 

దేశ్‌ముఖ్‌ను హోంమంత్రి పదవి నుంచి తప్పించనున్నారన్న వార్తల నేపథ్యంలో పవార్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముంబైలోని హోటళ్లు, బార్లు, పబ్స్, రెస్టారెంట్లు, హుక్కా పార్లర్లు.. తదితరాల నుంచి నెలకు కనీసం రూ. 100 కోట్లు వసూలు చేయాలని హోంమంత్రి దేశ్‌ముఖ్‌ పోలీసు అధికారులకు టార్గెట్లు పెట్టారని పరమ్‌వీర్‌ సింగ్‌ ఆరోపించిన విషయం తెలిసిందే.   కాగా, సీనియర్‌ పోలీస్‌ అధికారి సచిన్‌ వాజేను మళ్లీ పోలీస్‌ విభాగంలోకి తీసుకోవడంలో సీఎం ఠాక్రేకు కానీ, హోంమంత్రి దేశ్‌ముఖ్‌కు కానీ సంబంధం లేదని శరద్‌ పవార్‌ తెలిపారు. పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌పై రాజకీయ జోక్యం పెరిగిందని పరమ్‌వీర్‌ సింగ్‌ తనకు గతంలో ఫిర్యాదు చేశారని వెల్లడించారు.

రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని అస్థిరపర్చే కుట్రలు సాగబోవని పవార్‌ స్పష్టం చేశారు. మరోవైపు, హోంమంత్రిపై వచ్చిన అవినీతి ఆరోపణలు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీశాయని శివసేన  నేత సంజయ్‌రౌత్‌ వ్యాఖ్యానించారు. మహా వికాస్‌ అఘాడీ మిత్రపక్షాలు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉందన్నారు. అనిల్‌ దేశ్‌ముఖ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్‌ స్పందించాలని, దేశ్‌ముఖ్‌ను ప్రభుత్వంలో కొనసాగించే విషయంలో నిర్ణయం తీసుకోవాలని అదే పార్టీ నేత సంజయ్‌ నిరుపమ్‌ వ్యాఖ్యానించారు. దేశ్‌ముఖ్‌ తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. రాష్ట్రంలో బీజేపీ శ్రేణులు నిరసనలు చేపట్టాయి. ఆరోపణల తీవ్రత దృష్ట్యా అనిల్‌ దేశ్‌ముఖ్‌పై వేటు తప్పకపోవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ విషయంపై మిత్ర పక్షాల మధ్య విబేధాలు వచ్చే అవకాశాలు న్నాయనుకుంటున్నాయి. అయితే, అనిల్‌దేశ్‌ముఖ్‌ రాజీనామా చేయబోరని ఎన్సీపీ స్పష్టం చేసింది. పవార్‌తో చర్చించిన తరువాత ఎన్సీపీ మహారాష్ట్ర చీఫ్‌ జయంత్‌ పాటిల్‌ ఈ వ్యాఖ్య చేశారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు