ముంబై పోలీస్‌ మాజీ బాస్‌పై అక్రమ వసూళ్ల కేసు

23 Jul, 2021 02:33 IST|Sakshi

ఐపీఎస్‌ అధికారి పరంబీర్, మరో ఐదుగురు పోలీసు అధికారులపై ఆరోపణలు

ముంబై: ముంబై పోలీస్‌ మాజీ కమిషనర్, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పరంబీర్‌సింగ్, ఐదుగురు పోలీస్‌ అధికారులతోపాటు మరో ఇద్దరిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ బిల్డర్‌పై ఉన్న కేసులను మాఫీ చేయించేందుకు వీరు రూ.15 కోట్లు డిమాండ్‌ చేశారని అధికారి ఒకరు గురు వారం వెల్లడించారు. మెరైన్‌ డ్రైవ్‌ పోలీస్‌ స్టేషన్‌లో వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టామన్నారు. ఈ కేసుకు సంబంధించి సునీల్‌ జైన్, సంజయ్‌ పునామియా అనే ఇద్దరు బిల్డర్లను అరెస్ట్‌ చేశామ న్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్‌ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాల వాహనం కేసులో సచిన్‌ వాజే అనే పోలీస్‌ అధికారి అరెస్ట్‌ అనంతరం మార్చిలో ముంబై పోలీస్‌ కమిషనర్‌గా ఉన్న పరంబీర్‌సింగ్‌ను హోం గార్డ్‌ విభాగానికి డీజీగా ప్రభుత్వం బదిలీ చేసింది. అకోలా పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ బీఆర్‌ ఘడే ఫిర్యాదు మేరకు పరంబీర్‌పై ఏప్రిల్‌లో ఎస్‌సీ, ఎస్‌టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది.

అనిల్‌ దేశ్‌ముఖ్‌కు హైకోర్టులో చుక్కెదురు
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌కు బాంబే హైకోర్టు షాకిచ్చింది. ఆయనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేసేందుకు న్యాయస్థానం నిరాక రించింది. ఇదే కేసులో తీర్పుపై స్టే ఇచ్చి, అప్పీల్‌కు అవకాశమి వ్వాలన్న వినతిని కూడా హైకోర్టు తోసిపుచ్చింది. అనిల్‌ పిటిషన్‌ ‘కొట్టివేయదగినది’ అని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా ముంబై పోలీస్‌ మాజీ కమిషనర్‌ పరంబీర్‌సింగ్‌ చేసిన అవినీతి ఆరోపణలపై జయశ్రీ పాటిల్‌ అనే లాయర్‌ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు అనిల్‌పై ఉన్న ఆరోపణలపై దర్యాప్తు జరి పిన సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) ఏప్రిల్‌ 24వ తేదీన కేసు నమోదు చేసింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు