నపుంసకుడా.. క్రూరత్వంతో సమానం

22 Nov, 2020 08:25 IST|Sakshi

ఆ ఆరోపణ క్రూరత్వంతో సమానం

న్యూఢిల్లీ : జీవిత భాగస్వామి నపుంసకుడంటూ భార్య తప్పుడు ఆరోపణ చేయడం క్రూరత్వమేనని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ చర్య అతని ఆత్మ విశ్వాసంతోపాటు మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్న వాదనతో ఏకీభవించింది. ఆ దంపతులకు విడాకులు మంజూరు చేస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఢిల్లీకి చెందిన ఈ దంపతులకు 2012లో వివాహమైంది. ఆమెకు అది మొదటి వివాహం కాగా, అతనికి రెండో పెళ్లి. పెళ్లికి ముందునుంచే ఆమె మానసిక సమస్యలతో బాధపడుతోందనీ ఆ విషయం దాచి పెట్టారని భర్త ఆరోపిస్తూ విడాకుల కోసం కోర్టులో పిటిషన్‌ వేశాడు. దీంతో భార్య..అతడు నపుంసకుడనీ, సంసారిక జీవితానికి పనికిరాడంటూ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. (వామ్మో.. మళ్లీ లాక్‌డౌనా?)

ఆ ఆరోపణపై న్యాయస్థానం వైద్య నిపుణుడితో పరీక్షలు చేయించి అసత్యమని గుర్తించింది. భర్త వినతి మేరకు హిందూ వివాహ చట్టం కింద విడాకులు మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. అయితే, అతనితో కలిసే ఉంటానని, విడాకుల తీర్పును రద్దు చేసి, వైవాహిక హక్కులను పునరుద్ధరించాలంటూ  సదరు మహిళ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. శనివారం విచారణ జరిపిన జస్టిస్‌ మన్మోహన్, జస్టిస్‌ సంజీవ్‌ నరూలాల ధర్మాసనం..దిగువ న్యాయస్థానం ఇచ్చిన తీర్పులో ఎటువంటి లోపం లేదని పేర్కొంటూ ఆ మహిళ అప్పీల్‌ను కొట్టివేసింది. ఇలాంటి తీవ్ర ఆరోపణలు చేసి తీవ్ర వేదనను, బాధను కలుగజేసిన మహిళతో కలిసి ఉండటం ప్రమాదకరమని ఆ వ్యక్తి భావించడం సహేతుకమేనని తెలిపింది. వీరి వైవాహిక బంధం పునరుద్ధరించడానికి వీలులేనంతగా దెబ్బతిందని వ్యాఖ్యానించింది. (విడాకులు కోరిన ఐఏఎస్‌ దంపతులు)

>
మరిన్ని వార్తలు