4 వారాల తర్వాత కోవిషీల్డ్‌ రెండో డోస్‌కు చాన్సివ్వండి

7 Sep, 2021 06:14 IST|Sakshi

కొచ్చి: కోవిడ్‌ నుంచి ముందస్తు రక్షణలో భాగంగా తొలి కరోనా టీకా తీసుకున్న కేవలం 4 వారాల తర్వాత రెండో డోస్‌ కోవిషీల్డ్‌ టీకా కోరే పౌరులకు ఆ అవకాశం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి కేరళ హైకోర్టు ఆదేశాలిచ్చింది. కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాల ప్రకారం దేశంలోని పౌరులు మొదటి డోస్‌ కరోనా టీకా తీసుకున్న కనీసం 12 వారాల (84 రోజుల) తర్వాతే రెండో డోస్‌ తీసుకోవాలి. ఆలోపు రెండో డోస్‌ ఇవ్వరు. అయితే, తొలి డోస్‌ తీసుకున్న కేవలం 4 వారాల తర్వాత రెండో డోస్‌ కోవిషీల్డ్‌ తీసుకోవాలనుకునే వారు కోవిన్‌ పోర్టల్‌ ద్వారా వ్యాక్సినేషన్‌ను షెడ్యూల్‌ చేసుకునేందుకు అనుమతించాలని ఓ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు సూచించింది.

తమ సంస్థలో పనిచేసే 5,000 మందికిపైగా ఉద్యోగులకు తొలి డోస్‌ కోవిషీల్డ్‌ టీకా ఇప్పించామని, ప్రభుత్వ నిబంధనల కారణంగా 84 రోజుల్లోపే రెండో డోస్‌ ఇవ్వడం కుదరడం లేదని, 4 వారాల టీకా గ్యాప్‌ తర్వాత రెండో డోస్‌కు అనుమతించాలని కైటెక్స్‌ గార్మెంట్స్‌ అనే సంస్థ కేరళ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును జస్టిస్‌ పీబీ సురేశ్‌ కుమార్‌ విచారించారు. ‘విద్య, ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లే వారికి ముందస్తు టీకా అనుమతులు ఇస్తున్నారు. భారత్‌లోనే ఉంటూ ఇక్కడే ఉద్యోగం, విద్య కోసం ఇల్లు దాటే పౌరులు తమకూ ముందస్తు టీకా అనుమతులు ఇవ్వాలని కోరుతున్నారు. స్వదేశంలో ఉండే వారికీ ఈ వెసులుబాటు ఎందుకు ఇవ్వడం లేదు? అనే ప్రశ్నకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సమాధానం రావట్లేదు’ అని జడ్జి అన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు