అమర్‌ జవాన్‌ జ్యోతి విలీనం పూర్తి!

21 Jan, 2022 17:09 IST|Sakshi

ఢిల్లీ: ఐదు దశాబ్దాల తర్వాత ఇండియన్‌ గేట్‌ వద్ద ఉన్న అమర్‌ జవాన్‌ జ్యోతిని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద విలీనం చేశారు. ఈ మేరకు శుక్రవారం విలీన ప్రక్రియ పూర్తయ్యింది.  అయితే అమర్‌ జవాన్‌ జ్యోతిని కొంతమేర మాత్రమే విలీనం చేసినట్లు తెలుస్తోంది.  1971 యుద్ధ వీరులకు నివాళిగా అమర్‌ జవాన్‌ జ్యోతిని ఏర్పాటు చేయగా, 1971 యుద్ధ వీరులు సహా స్వాతంత్ర్యానంతరం జరిగిన అన్ని యుద్ధాల్లో అమరులైన సైనికులకు గుర్తుగా 2019 లో నేషనల్ వార్ మెమోరియల్ ఏర్పాటైంది. కాగా, 1971 యుద్ధ వీరుల పేర్లు చెక్కిన చోటే అమర్‌ జవాన్‌ జ్యోతిని విలీనం చేయాలని భావించే కేంద్రం ఈ విలీన ప్రక్రియకు ముందుకెళ్లింది. 

దీన్ని తొలుత పూర్తిగా విలీనం చేయాలని భావించినా.. విపక్షాల అభ్యంతరాల నేపథ్యంలో కేంద్రం కాస్త వెనక్కి తగ్గినట్టే కనబడుతోంది. ఇండియన్‌ గేట్‌ వద్ద ఉన్న అమర్‌ జవాన్‌ జ్యోతిని పూర్తిగా మూసివేసేందుకు కేంద్రం యత్నిస్తోందని, ఇది అమర వీరులకు నిజమైన నివాళి ఎలా అవుతుందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. అదే సమయంలో మిగతా పార్టీల నుంచి నిరసన గళం వినిపించింది. దాంతో కేంద్రం దాన్ని సరిదిద్దుకునే యత్నం చేసింది. ఈ విలీన ప్రక్రియ పూర్తిగా జరగడం లేదని, కొంతమేర మాత్రమే చేస్తున్నట్లు కేంద్రం స్పష్టతనిచ్చింది.

అమర్‌ జవాన్‌ జ్యోతి వద్ద అక్కడ అమరులైన వారి పేర్లు లేవని, నేషనల్‌ వార్‌ మెమోరియల్‌ వద్ద మాత్రమే అమరులైన సైనికుల పేర్లు ఉండంతోనే ఈ విలీన ప్రక్రియ చేపట్టినట్లు తెలిపింది. అమరుల పేర్లు ఉన్నచోట ‘ జ్యోతి’ ఉంటే అది వారికి నిజమైన నివాళి అవుతుంది కదా అని విమర్శలను తిప్పికొట్టింది.  కాగా, ఇండియన్‌ గేట్‌కు 400 మీటర్ల దూరంలో నేషనల్‌ వార్‌ మెమోరియల్‌ ఉండగా, ‘ జ్యోతి’విలీన ప్రక్రియకు ప్రధాన కారణం మాత్రం ఈ రెండింటిని చూడటం కాస్త కష్టతరంగా మారే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి అమర్‌ జవాన్‌ జ్యోతి విలీన ప్రక్రియ జరిగినప్పటికీ అది పూర్తిగా జరిగిందా.. లేక కొంత మేర చేశారా? అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. 1972లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ.. అమర్‌ జవాన్‌ జ్యోతిని ఏర్పాటు చేయగా, 2019లో ప్రధాని నరేంద్ర మోదీ నేషనల్‌ వార్‌ మెమోరియల్‌ను ఏర్పాటు చేయడం విశేషం. 

మరిన్ని వార్తలు