‘గురుద్వార్‌ను మసీదుగా మార్చడాన్ని ఖండిస్తున్నాం’

28 Jul, 2020 10:38 IST|Sakshi

చండీగఢ్ : లాహోర్‌లోని చారిత్రాత్మక గురుద్వార్‌ను మసీదుగా మార్చడానికి పాకిస్తాన్‌ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మంగళవారం ఖండించారు. ఈ అంశంపై భారత్ ఇప్పటికే పాకిస్థాన్‌పై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై పంజాబ్‌ సీఎం స్పందిస్తూ..సిక్కుల సమస్యలను పొరుగు దేశానికి తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ‘లాహోర్‌లోని పవిత్ర గురుద్వార్‌ శ్రీ షాహిది అస్తాన్‌ను మసీదుగా మార్చడానికి చేసిన ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. సిక్కుల గౌరవ ప్రదేశాలను కాపాడటానికి పంజాబ్  ఆందోళనలను పాకిస్తాన్‌కు బలంగా తెలియజేయాలని విదేశాంగ మంత్రి జైశంకర్‌ను కోరుతున్నాం’ అని సింగ్ ట్వీట్ చేశారు. (పంజాబ్‌లో పెన్షన్‌ స్కామ్‌ కలకలం)

కాగా గురుద్వార్‌ షాహిది అస్తాన్ 1745లో భాయ్ తరు సింగ్ ప్రాణాంతకంగా గాయపడిన ప్రదేశంలో నిర్మించిన చారిత్రక మందిరం. గురుద్వార్‌ సిక్కులకు పవిత్ర పుణ్యక్షేత్రం. లాహోర్‌లోని గురుద్వార్‌ను మసీదుగా మారుస్తున్నట్లు వచ్చిన వార్తలపై పాకిస్తాన్ హైకమిషన్‌కు భారత్ సోమవారం తీవ్ర నిరసన తెలిపింది. ఈ సంఘటనపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందని, ఈ విషయంపై దర్యాప్తు జరిపి తక్షణ పరిష్కార చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్‌కు పిలుపునిచ్చినట్లు ఎంఈఎం ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు.  పాకిస్తాన్‌లో మైనారిటీ సిక్కు సమాజానికి న్యాయం చేయాలని కోరినట్లు తెలిపారు. (కరోనా కల్లోలం: భారత్‌లో కొత్తగా 47,704 కేసులు) 

మరిన్ని వార్తలు