జూన్‌ 28 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర

14 Mar, 2021 05:54 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఏటా శివ భక్తులు ఎంతగానో ఎదురుచూసే అమర్‌నాథ్‌ యాత్ర తేదీలు ఖరారు అయ్యాయి. గతేడాది కోవిడ్‌–19 మహమ్మారి కారణంగా రదై్దన యాత్రను ఈ ఏడాది జూన్‌ 28 నుంచి ఆగస్టు 22 వరకు నిర్వహించాలని అమర్‌నాథ్‌ పుణ్యక్షేత్ర బోర్డు నిర్ణయించింది. శనివారం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా అధ్యక్షతన రాజ్‌భవన్‌లో జరిగిన 40వ అమర్‌నాథ్‌ పుణ్యక్షేత్ర బోర్డు సమావేశంలో యాత్ర షెడ్యూల్‌తో పాటు, పలు కీలక అంశాలపై చర్చించారు. కోవిడ్‌ ప్రొటోకాల్స్‌ కచ్చితంగా పాటిస్తూ యాత్రను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్ర బాల్టాల్‌ మార్గం ద్వారా మాత్రమే జరిగే అవకాశాలున్నాయి. ప్రయాణం పహల్గామ్, చందన్వాడి, శేష్నాగ్, పంచతర్ని గుండా సాగుతుంది.

అమర్‌నాథ్‌ గుహలో మంచు స్ఫటికాలతో ఏటా 10–12 అడుగుల ఎత్తైన మంచు శివలింగం ఏర్పడుతుంది. అంతేగాక అమర్‌నాథ్‌ శివలింగం ఎత్తు చంద్రునిపై ఆధారపడి ఉంటుంది. పౌర్ణమి నాడు శివలింగం దాని పూర్తి పరిమాణంలో ఉండగా, అమావాస్య రోజున శివలింగ పరిమాణం కొంత తక్కువగా ఉంటుంది. అమర్‌నాథ్‌ గుహ శ్రీనగర్‌ నుంచి 145 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గుహ సుమారు 150 అడుగుల ఎత్తు, 90 అడుగుల పొడవు ఉంటుంది. ఈ గుహ సుమారు 4 వేల మీటర్ల ఎత్తులో ఉంటుంది.  ఏప్రిల్‌ 1 నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ: దేశవ్యాప్తంగా 37 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, జమ్మూ కాశ్మీర్‌ బ్యాంక్‌ , యస్‌ బ్యాంక్‌ల 446 బ్రాంచుల్లో ఏప్రిల్‌ 1 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. గతేడాది కరోనా  కారణంగా అమర్‌నాథ్‌ యాత్రను సాధువులకు మాత్రమే పరిమితం చేశారు. 2019లో 3.42 లక్షలకు పైగా భక్తులు దర్శించుకున్నారు. 

మరిన్ని వార్తలు