Amarnath Yatra: హఠాత్తుగా కుంభవృష్టి.. గుహచుట్టూ నీరు.. వరదల్లో 12 వేలమంది?

8 Jul, 2022 19:38 IST|Sakshi

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌ అమర్‌నాథ్‌ యాత్రను ఊహించని విపత్తు ముంచెత్తింది. శుక్రవారం సాయంత్రం కురిసిన కుంభవృష్టితో ఆకస్మిక వరద పోటెత్తింది. గుహ పరిసరాల్లోకి వరద నీరు భారీగా చేరుకుంది. సుమారు 12 వేల మంది భక్తులు వరదలో చిక్కుకుపోయారు. వరద ఉధృతికి పలువురు కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. ఈ సంఖ్య భారీగా పెరగొచ్చని భావిస్తున్నారు. 

సాయం‍త్రం 5.30గం. నుంచి కుంభవృష్టి మొదలైంది. భోలేనాథ్‌ గుహ సమీపంలోనే మొదలైంది కుంభవృష్టి. ఆకస్మిక వరద ఉదృతికి యాత్రికుల టెంట్లు మొత్తం కొట్టుకుని పోయాయి. పలువురు వరదల్లో కొట్టుకుపోగా.. ఐదుగురు మృతి చెందినట్లు సమాచారం. అయితే చాలా మంది కనిపించకుండా పోవడంతో వరదలో కొట్టుకుని పోయి ఉంటారని భావిస్తున్నారు. ప్రాణ నష్టం వివరాలు ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. విపత్తు నేపథ్యంలో అమర్‌నాథ్‌ యాత్రకు తాత్కాలిక వాయిదా వేశారు.

ఆకాశం బద్ధలైనట్లుగా.. 2 కిలోమీటర్ల మేర వరద ఒక్కసారిగా కొండపై నుంచి కిందకు పోటెత్తిందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. పెను విషాదంగా మారే అవకాశాలు లేకపోలేదని అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షం తగ్గడంతో.. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.  ఐటీబీపీ, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు లైట్ల వెలుతురులో రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహిస్తోంది. మరింత సమాచారం అందాల్సి ఉంది.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు