జేఈఈ ప్రిపేర్ విద్యార్థుల కోసం అమెజాన్ ఫ్రీ కోచింగ్

4 Apr, 2021 15:35 IST|Sakshi

మీరు జేఈఈ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. ఐఐటీ జేఈఈ కోర్సుల కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం అమెజాన్ అకాడమీ ఫ్రీ కోచింగ్ అందిస్తుంది. అమెజాన్ ఇండియా జనవరిలో అమెజాన్ అకాడమీ పేరుతో ఒక ఎడ్‌టెక్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేసింది. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ఐఐటీ జేఈఈ విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ అందిస్తోంది. నిపుణులైన జేఈఈ ఉపాధ్యాయులచే లైవ్ సెషన్స్ కూడా అందిస్తుంది. ఈ పరీక్షల కోసం మీరు అమెజాన్ అకాడమీ (https://academy.amazon.in/) వెబ్‌సైట్‌లో ఎన్‌రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. 

ప్రస్తుతానికి మాత్రం ఈ సేవలు ఉచితంగా లభిస్తున్నాయి. గూగుల్ ప్లే స్టోర్‌లో అమెజాన్ అకాడమీ పేరుతో ఉన్న యాప్ డౌన్‌లోడ్ చేసుకొని కూడా ఎన్‌రోల్ చేసుకోవచ్చు. కొన్ని నెలల పాటు మొత్తం కంటెంట్ ఉచితంగా అందించనున్నట్లు అమెజాన్ అకాడమీ పేర్కొంది. కేవలం విద్యార్థులు తమ ఇంటి దగ్గర ఇంటర్నెట్ కనెక్షన్, స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్, ల్యాప్‌టాప్ ఉంటే చాలు ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు. అమెజాన్ అకాడమీ ప్లాట్‌ఫామ్ లో జేఈఈ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థులకు అవసరమయ్యే మొత్తం కంటెంట్ ఉంటుంది.

అనుభవం గల టీచర్లు చెప్పే లైవ్ ఆన్‌లైన్ క్లాసులకు హాజరు కావొచ్చు. మాక్ టెస్టుల్లో పాల్గొనొచ్చు. నిపుణుల సారథ్యంలో జేఈఈ పరీక్షలకు ప్రిపేర్ కావొచ్చు. రియల్ టైమ్‌లో తమ సందేహాలకు సమాధానాలు తెలుసుకోవచ్చు. ఆల్ ఇండియా మాక్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. అమెజాన్ అకాడమీ నిర్వహించే జేఈఈ మాక్ టెస్టులకు హాజరై ఆల్ ఇండియా ర్యాంక్ తెలుసుకోవచ్చు. భారతదేశంలో జేఈఈ రాయాలనుకుంటున్నవారితో పోటీపడటంతో పాటు తమ స్కోర్స్ కంపేర్ చేసుకోవచ్చు. 

చదవండి:

సుప్రీంకోర్టుకు ‘ఇస్రో కుట్ర కేసు’ నివేదిక

మరిన్ని వార్తలు