ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌ ఇంట్లో ఆరుగంటలపాటు సోదాలు.. ప్రశ్నల వర్షం

17 Jun, 2021 12:42 IST|Sakshi

ముంబై: రిలయన్స్‌ అధినేత ముకేష్‌ అంబానీకి బాంబు బెదిరింపు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అంబానీ ఇల్లు ఎంటిలియా ముందు పేలుడు ప‌దార్ధాల‌తో వాహ‌నాన్ని నిలిపిన కేసులో ఇవాళ జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) విచార‌ణ చేప‌ట్టింది. ఈ క్రమంలో మాజీ పోలీసు అధికారి, ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్టుగా గుర్తింపు పొందిన ప్రదీప్‌ శ‌ర్మ ఇంట్లో ఆరుగంటలపాటు సోదాలు చేప‌ట్టి.. ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది. 

అంధేరీలోని ప్రదీప్‌ శర్మ ఇంట్లో గురువారం ఉదయం ఎన్‌ఐఎతో పాటు సీఆర్‌పీఎఫ్ సిబ్బంది తనీఖీలు చేపట్టారు. ఉదయం ఐదుగంటల నుంచి సుమారు ఆరుగంటలపాటు ఈ సోదాలు కొనసాగినట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రదీప్‌పై పశ్నల వర్షం కురిపించింది ఎన్‌ఐఏ. ఇక ఈ కేసులో షీల‌ర్ అనే అనుమానితుడితో శ‌ర్మ గతంలో దిగిన ఫోటోలు బ‌య‌ట‌కు రావ‌డంతో ఆయ‌న‌పై ద‌ర్యాప్తు ప్రారంభించారు. షీల‌ర్ గ‌తంలో పోలీసు ఇన్‌ఫార్మర్‌గా పని చేశాడని, అయినా రోజూ తనతో ఎంతో మంది ఫొటోలు దిగుతారని ప్రదీప్‌ వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, ఈ కేసులో శర్మను ఏప్రిల్‌లోనే ఓసారి ప్రశ్నించారు కూడా.

వాజే గురువు
ఇక మన్సుక్ హిరేన్ మృతి కేసులో ఏవైనా ఆధారాలు దొరుకుతాయ‌న్న ఉద్దేశంతోనే శర్మ ఇంట్లో సోదాలు చేప‌ట్టిన‌ట్లు ఓ అధికారి చెప్పారు. ఇక ఈ కేసులో  ఎన్‌ఐఎ కస్టడీలో ఉన్న మాజీ ఇన్‌స్పెక్టర్ స‌చిన్ వాజేకు, శ‌ర్మ గురువులాంటోడు. ముకేశ్ అంబానీ ఇంటి ముందు వాహ‌నంలో దొరికిన 20 జెలిటిన్ స్టిక్స్‌ను ప్రదీప్ శ‌ర్మ ద్వార‌నే తెప్పించిన‌ట్లు వాజే స్టేట్‌మెంట్‌ కూడా ఇచ్చాడు. ఈ కేసుతో పాటు వ్యాపార‌వేత్త మన్సుక్ హిరేన్ మృతి కేసులోనూ వాజే అనుమానితుడిగా ఉన్నారు.

కాగా, ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా పేరున్న ప్రదీప్‌ శర్మపై 2006లో లఖన్‌ భయ్యా ఎన్‌కౌంటర్, అందులో దావూద్‌ ఇబ్రహీం గ్యాంగ్‌కు సాయం చేశారన్న ఆరోపణలు రావటంతో వేటు పడింది. 2017లో తిరిగి విధుల్లోకి వచ్చిన ఆయన..  2019లో ప్రదీప్ శ‌ర్మ పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేశారు. శివ‌సేనలో చేరి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం తన పేరుమీద ఓ ఎన్జీవో నడుపుతున్నారు 59 ఏళ్ల ప్రదీప్‌.

చదవండి: రియల్‌ అబ్ తక్ చప్పన్: పాతికేళ్ల సర్వీస్‌. 100 ఎన్‌కౌంటర్లు

మరిన్ని వార్తలు