Ambulance Couple: హిమాన్షు, ట్వింకిల్‌ స్ఫూర్తిగాథ

17 May, 2021 09:07 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనాసురుడు విసురుతున్న మృత్యుపాశానికి చిక్కి ప్రాణాలు కోల్పోతున్నది కొందరైతే.. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రులకు పరుగున వెళ్తున్నది ఇంకొందరు. వైద్యశాలకు వెళ్లాలంటే ముందుగా గుర్తొచ్చేది అంబులెన్సే. మెరుపు వేగంతో దూసుకెళ్తూ కోవిడ్‌ బాధితులను ఆస్పత్రులకు చేర్చే కదిలే దేవాలయాలు అంబులెన్స్‌లు.

సరాయ్‌ కాలేఖాన్‌ శ్మశాన వాటికలో పీపీఈ కిట్లతో హిమాన్షు కాలియా దంపతులు
అలాంటి అంబులెన్స్‌ సర్వీస్‌ చార్జీలను కోవిడ్‌ కష్టకాలంలో కొందరు నిర్దయగా వేలు, లక్షలు వసూలు చేస్తూ కోవిడ్‌ బాధితులను మరింతగా అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారు. అలాంటి పేదలకు పూర్తి ఉచితంగా అంబులెన్స్‌ సేవలను అందిస్తోంది ఓ జంట. వారే హిమాన్షు, ట్వింకిల్‌ ఖాలియా. 42 ఏళ్ల హిమాన్షుకు అర్ధాంగి అయిన 39 ఏళ్ల ట్వింకిల్‌.. సేవా కార్యక్రమాల్లో భర్తకు అన్నివేళలా అండగా ఉంటున్నారు. 

క్యాన్సర్‌ జయించి...  
‘కొద్ది రోజుల క్రితం తూర్పు ఢిల్లీలోని మయూర్‌ విహార్‌లో ఆటోరిక్షాలో వెళ్తుండగా తన భార్య కుప్పకూలిందని ఆమె భర్త సందీప్‌ మిత్రా మాకు ఫోన్‌ చేశారు. అక్కడ ఉన్నవారిలో ఒక్కరు కూడా వారికి సాయపడేందుకు ముందుకు రాలేదు. విషయం తెల్సి డాక్టర్‌ను వెంటబెట్టుకుని అక్కడికెళ్లా. ఆమె అంత్యక్రియల బాధ్యత మేమే తీసుకున్నాం’అని హిమాన్షు సతీమణి ట్వింకిల్‌ నాటి సంగతిని గుర్తుచేసుకున్నారు.

తనను క్యాన్సర్‌ చుట్టుముట్టినా దాన్ని ఎదిరించి నిలిచిన ధీశాలి ఆమె. వీరికి జప్జీ (13), రిధీ (7) అనే ఇద్దరు కుమార్తెలున్నారు. ‘కరోనా కష్టకాలంలో అంబులెన్స్‌ సేవలకు కొందరు అంబులెన్స్‌ డ్రైవర్లు, ఓనర్లు వేలు, లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారని తెల్సి చాలా బాధపడ్డా. వెంటనే ఉచితంగా అంబులెన్స్‌ సేవల విషయాన్ని అందరికీ చెప్పా. ఢిల్లీ అంతటా నా ఫోన్‌ నంబర్‌ ఉన్న పోస్టర్లు అతికించాం. అది చూసి చాలా మంది మాకు ఫోన్లు చేశారు. ఢిల్లీ ఆవల ఘజియాబాద్, నోయిడా నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి. అత్యంత వేగంగా నడిపే నా డ్రైవింగ్‌ నైపుణ్యం తెలిసి చాలా ఆస్పత్రుల వాళ్లూ నాకే ఫోన్‌ చేసేవారు ఆపత్కాలంలో’ అని హిమాన్షు అన్నారు. 

ఉచితంగా 12 అంబులెన్స్‌ల నిర్వహణ అంటే శ్రమ, ఖర్చుతో కూడిన వ్యవహారమే. వాటి రిపేర్లు, ఇతరత్రాల కోసం 18 మంది ఈ జంటకు సాయపడతారు. ఒక ఇంటినే కార్యాలయంగా మలచుకుని ఈ జంట ఇదంతా చేస్తోంది. హిమాన్షు, ట్వింకిల్‌ ఇద్దరూ వృత్తిరిత్యా బీమా ఏజెంట్లు. వారి ఆదాయంలో చాలా భాగాన్ని సేవ కోసమే ఖర్చుచేస్తారు.

‘కొన్ని సార్లు మా పిల్లల స్కూల్‌ ఫీజులు కట్టలేకపోయాం. కానీ, డ్రైవర్ల జీతాలు మాత్రం ఠంచనుగా ఇస్తాం’ అని హిమాన్షు నవ్వుతూ చెప్పారు. ‘2002లో తొలిసారిగా అంబులెన్స్‌ సేవలను ప్రారంభించాం. పెళ్లి సమయంలో నా అత్తామామలు పెళ్లి బహుమతిగా ఒక అంబులెన్స్‌ ఇచ్చారు. కాలం గడిచేకొద్దీ అంబులెన్స్‌ సంఖ్య పెరుగుతూ వచ్చింది’ అని హిమాన్షు అన్నారు.

కోవిడ్‌ ముందు సైతం వారు ఎన్నో దాతృత్వ కార్యక్రమాలు చేశారు. పేదలకు పెద్ద ఆస్పత్రుల్లో అడ్మిషన్లు ఇప్పించడం, రక్తదానాలు, అంతిమసంస్కారాల ఖర్చులు భరించడం.. ఇలా పలు రకాలుగా కష్టాల్లో ఉన్న వారిని ఈ జంట ఆదుకుంది. ఈ జంటను కొన్ని అవార్డులూ వరించాయి.

2019లో ట్వింకిల్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ‘నారీ శక్తి పురస్కార్‌’తో సత్కరించారు. అంతకుముందు, 2015లో ‘ఫస్ట్‌ ఉమెన్‌ అంబులెన్స్‌ డ్రైవర్‌’ అవార్డును దుబాయ్‌ సంస్థ అందజేసింది. మలేసియాలో ‘అంబులెన్స్‌ మ్యాన్‌’ అవార్డుతో హిమాన్షును గౌరవించారు.

12 సొంత అంబులెన్స్‌లతో...
కోవిడ్‌ రెండో వేవ్‌లో వేలాది కేసులతో దేశ రాజధాని ఢిల్లీ అల్లాడుతున్న వేళ ఉత్తర ఢిల్లీలో ఉండే ఈ జంట కోవిడ్‌ బాధితులకు తమ వంతు సాయం చేస్తోంది. అస్వస్థతకు గురైన వారిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తూ, కావాల్సిన ఔషధాలు సమకూరుస్తూ తమ సేవా నిరతిని చాటుకుంటున్నారీ దంపతులు.

రోగులకే కాదు కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయిన వారి అంత్యక్రియల్లోనూ హిమాన్షు– ట్వింకిల్‌లు తమకు తోచినంతలో ఆర్థికసాయం చేస్తున్నారు. పీపీఈ కిట్లు, ఫేస్‌ షీల్డ్, మాస్క్‌లు ధరించి ఆపదలో ఉన్న వారి ముందు వాలిపోతారు వీరిద్దరూ. దగ్గరి బంధువులు సైతం సపర్యలు చేయడానికి జంకే రోగులకు సైతం వీరు సేవచేశారు.

హిమాన్షు జంటకు సొంతంగా 12 అంబులెన్స్‌లు ఉన్నాయి. అంబులెన్స్‌ అత్యవసరంగా కావా లని ఎవరైనా సమాచారం ఇవ్వగానే వెంటనే వీరు రంగంలోకి దిగుతారు. ‘సరిగ్గా అంకెలు గుర్తులేవుగానీ ఈ కరోనా సెకండ్‌ వేవ్‌ కాలంలో రోజుకు కనీసం పాతిక మందికి మేం సాయపడుతున్నాం. కోవిడ్‌తో మరణించిన 80 మంది అంత్యక్రియలకు మొత్తం ఖర్చు మేమే భరించాం. దాదాపు వేయి మందికిపైగా కోవిడ్‌ మృ తుల అంత్యక్రియలకు తోచినసాయం చేశాం. ఎక్కడా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అంతా ఉచితం’ అని హిమాన్షు చెప్పారు. 
చదవండి: వ్యాక్సిన్ల సంఖ్య ఎందుకు తగ్గుతోంది: చిదంబరం ఫైర్‌

మరిన్ని వార్తలు