’మా నాన్న శాశ్వతంగా వెళ్లిపోయారు’

12 Oct, 2020 17:34 IST|Sakshi
ఆరిఫ్‌ ఖాన్‌(ఫైల్‌: ఫొటో కర్టెసీ: ఎన్డీటీవీ)

కోవిడ్‌ పేషెంట్లు, మృతదేహాలు తరలించిన అంబులెన్సు డ్రైవర్‌

మహమ్మారి బారిన పడి కన్నుమూత

తీరని విషాదంలో ఆరిఫ్‌ ఖాన్‌ కుటుంబం

న్యూఢిల్లీ: కరోనా కాలంలో సొంత కుటుంబ సభ్యులనే అనుమానంగా చూస్తూ, వైరస్‌ బారిన పడి మరణిస్తే కనీసం అంత్యక్రియలు కూడా చేయకుండా అనాథ శవాల్లా వదిలేసిన ఉదంతాలెన్నింటినో చూశాం. మహమ్మారి సోకుతుందనే భయంతో సొంతవాళ్లను సైతం పరాయివాళ్లను చేసి దూరం పెట్టిన ఘటనల గురించి విన్నాం. అయితే ఆరిఫ్‌ ఖాన్‌ అనే అంబులెన్స్‌ డ్రైవర్‌ మాత్రం ఇందుకు భిన్నం. మూడు దశాబ్దాల పాటు ‘సేవ’కే అంకితమైన ఆయన వందలాది మంది కోవిడ్‌ పేషెంట్లను ఆస్పత్రికి తరలించారు. ఎన్నెన్నో కరోనా మృతదేహాలను శ్మశాన వాటికలకు తరలించి ఈ లోకం నుంచి గౌరవప్రదమైన వీడ్కోలు లభించేలా చేసి మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంలా నిలిచారు.(చదవండి: బిహార్ మంత్రిని కబళించిన కరోనా)

అయితే ఇంతటి సేవాగుణం ఉన్న ఆరిఫ్‌ ఖాన్‌ను సైతం ఆ మహమ్మారి వదిలిపెట్టలేదు. కరోనా బాధితులకు నిరంతరం సేవలు అందించిన ఆ మహోన్నత వ్యక్తిని శనివారం బలితీసుకుంది. పది మందికీ సాయంగా నిలిచిన ఆరిఫ్‌ కుటుంబానికి తీరని విషాదం మిగిల్చింది. విధి నిర్వహణలో మునిగిపోయి నెలల తరబడి ఇంటికి దూరమై ఆస్పత్రిలోనే కాలం వెళ్లదీసిన ఆయన, అక్కడే శాశ్వత నిద్రలోకి జారుకోవడం అందరినీ కలచివేస్తోంది.

వివరాలు.. షాహిద్‌ భగత్‌ సింగ్‌ సేవాదళ్‌ అనే ఎన్జీవో కోవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో పేషెంట్లకు సేవలు అందిస్తోంది. ఢిల్లీ కేంద్ర పనిచేసే ఈ సంస్థ కరోనా బాధితులు, మృతదేహాల తరలింపు కోసం ఉచితంగా అంబులెన్స్‌ సేవలను అందుబాటులోకి తీసుకవచ్చింది. ఎన్నో ఏళ్లుగా ఈ ఎన్జీవోతో కలిసి పనిచేస్తున్న ఆరిఫ్‌ ఖాన్‌, ఈ బృహత్తర కార్యక్రమంలోనూ భాగస్వామ్యమయ్యారు. సుమారు 500 వందల కరోనా మృతదేహాలను, వందలాది మంది పేషెంట్లను తన అంబులెన్సులో గమ్యస్థానాలకు తరలించారు. ఈ క్రమంలో ఆయనకు కూడా కరోనా సోకడంతో, ఢిల్లీలోని హిందూరావు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరణించారు.(క‌రెన్సీ నోట్ల‌పై 28 రోజుల పాటు వైర‌స్)

నిజమైన కోవిడ్‌ వారియర్‌
ఈ విషయం గురించి షాహిద్‌ భగత్‌సింగ్‌ సేవాదళ్‌ అధ్యక్షుడు జితేందర్‌ సింగ్‌ షంటీ మాట్లాడుతూ.. ‘‘ ఆరిఫ్‌ బాయ్‌ చాలా గొప్పగా పనిచేశారు. పేషెంట్లకు అందుబాటులో ఉండేందుకు ఇంటికి కూడా వెళ్లేవారు కాదు. ఆస్పత్రిలో ఓ చోట నిద్రించేవారు. ఈ క్రమంలో అక్టోబరు 1న ఆయనలో కోవిడ్‌ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో పరీక్ష చేయించగా, కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కొన్నాళ్లపాటు క్వారంటైన్‌లో ఉన్న ఆయన ఆరోగ్యం విషమించడంతో శుక్రవారం హిందూ రావు ఆస్పత్రిలో చేర్పించాం. వైద్యులు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. శనివారం ఉదయం 8 గంటలకు ఆరిఫ్‌ బాయ్‌ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మేమంతా దగ్గరుండి ఆయన అంత్యక్రియలు నిర్వహించాం. ఆయన మరణం మాకు తీరని లోటు. నిజమైన కోవిడ్‌ వారియర్‌ ఆరిఫ్‌ బాయ్‌’’అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ఆరిఫ్‌ ఖాన్‌ మృతి, తోటి అంబులెన్సు డ్రైవర్ల సేవలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నప్పటికీ, తమ సామాజిక సేవకు ఆటంకం కలగకుండా వారిలో స్ఫూర్తి నింపుతామని చెప్పుకొచ్చారు.

మా నాన్నే మాకు ఆధారం..
ఇక ఆరిఫ్‌ ఖాన్‌ మరణంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన కుమారుడు ఆదిల్‌ ఖాన్‌(22) మాట్లాడుతూ.. ‘‘మా నాన్న 35 ఏళ్లుగా ఎన్జీవోలో పనిచేస్తున్నారు. మార్చి 21 తర్వాత ఒకటిరెండు సార్లు మినహా ఇంట్లో ఎక్కువ సమయం గడపలేదు. శనివారం మమ్మల్ని వదిలి శాశ్వతంగా వెళ్లిపోయారు. మేం ఇక్కడే, షాదారాలోని అద్దె ఇంట్లో నివసిస్తున్నాం. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనం పొందలేదు. ఇంట్లో సంపాదన ఉన్న ఏకైక వ్యక్తి మా నాన్నే. ఆయన ఇప్పుడు లేరు. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి’’అని కేజ్రీవాల్‌ సర్కారుకు విజ్ఞప్తి చేశాడు. అదే విధంగా ఆరిఫ్‌ ఖాన్‌ సహ డ్రైవర్లు, ఎన్జీవో సభ్యులు సైతం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. 

మరిన్ని వార్తలు