జాతరలో బీఫ్‌, పంది బిర్యానీకి నో.. కలెక్టర్‌కు ఎస్సీఎస్టీ కమిషన్‌ నోటీసులు

13 May, 2022 17:52 IST|Sakshi

చెన్నై: సంప్రదాయంగా వస్తున్న అంబూరు బిర్యానీ జాతరలో.. పంది, గోడ్డు మాంసానికి అనుమతి నిరాకరించడంపై తమిళనాడు ఎస్సీఎస్టీ కమిషన్‌ సీరియస్‌ అయ్యింది. ఈ మేరకు తిరుపత్తూరు జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. తన చర్యలపై పూర్తి వివరణ ఇవ్వాలంటూ నోటీసుల్లో కలెక్టర్‌ను కోరింది కమిషన్‌. 

అంబూర్‌ బిర్యానీ ఫెస్టివల్‌..అనాదిగా జరుగుతున్న ఈ జాతరలో 20 రకాల బిర్యానీలు వండి వడ్డిస్తారు. షెడ్యూల్‌ ప్రకారం.. మే 13-15 తేదీల మధ్య ఈ జాతర జరగాలి.  అయితే భారీ వర్షాల కారణంగా ఈ జాతరను తాత్కాలికంగా రద్దు చేసింది జిల్లా పరిపాలక విభాగం. కానీ, అంతకు ముందు జిల్లా కలెక్టర్‌, అధికారులు తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. 

బిర్యానీ ఫెస్టివల్‌లో బీఫ్‌ (గొడ్డు), పోర్క్‌(పంది)కు అనుమతి లేదని, వాటి బిర్యానీల స్టాల్స్‌ పెట్టొద్దంటూ జిల్లా కలెక్టర్‌ అమర్‌ ఖుష్‌వాహ ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయంపై పలు అభ్యంతరాలు సైతం వ్యక్తం అయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో.. తమిళనాడు ఎస్సీ ఎస్టీ కమిషన్‌ స్పందించింది. అలా ఎందుకు ఆదేశించారో వివరణ ఇవ్వాలంటూ నోటీసుల్లో స్పష్టం చేసింది కమిషన్‌. ఎస్సీ, ఎస్టీ, ముస్లిం కమ్యూనిటీలపై వివక్ష కిందకే వస్తుందని, దీనిని అంటరానితనంగా పరిగణిస్తున్నట్లు పేర్కొన్న  కమిషన్‌.. కలెక్టర్‌కు పంపిన నోటీసుల్లో పేర్కొంది.

మరిన్ని వార్తలు