Arvind Kejriwal: సీబీఐ దాడుల మధ్య కేజ్రీవాల్‌ ‘మిస్డ్ కాల్‌’ క్యాంపెయిన్‌

19 Aug, 2022 13:43 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ పాలసీలో అవకతవకలపై ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా నివాసాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహిస్తోంది. ఓ వైపు సీబీఐ దాడులు జరుగుతున్న క్రమంలోనే ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ మిషన్‌లో పాల్గొనాలని ‘మిస్డ్‌ కాల్‌’ ప్రచారం చేపట్టారు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌. ‘భారత్‌ను నంబర్‌ వన్‌ చేసేందుకు మా నేషనల్‌ మిషన్‌లో పాలుపంచుకోండి. అందుకు 9510001000కు మిస్డ్‌కాల్‌ ఇచ్చి భారత్‌ను అగ్రస్థానంలో నిలబెట్టండి.’ అని వీడియో ద్వారా పిలుపునిచ్చారు. ట్విట్టర్‌లోనూ ప్రజలకు సూచించారు. 

మనీశ్‌ సిసోడియా నివాసంలో సీబీఐ దాడులు చేపట్టిన తర్వాత మాట్లాడారు కేజ్రీవాల్‌. ‘సీబీఐ దాడులపై ఎలాంటి భయం అవసరం లేదు. వారి పనిని చేసుకోనిద్దాం. మమ్మల్ని వేధించేందుకు పైనుంచి వారికి ఆదేశాలు వచ్చాయి. మా నాయకుల పని అంతర్జాతీయంగా ప్రశంసలు పొందుతుంటే ఓర్వలేకపోతున్నారు.’ అని పేర్కొన్నారు కేజ్రీవాల్‌. మనీశ్‌ సిసోడియా ఢిల్లీ ఎడ్యుకేషన్‌ మోడల్‌ న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికలో తొలి పేజీలో వచ్చిన కథనాన్ని సూచిస్తూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. మరోవైపు.. ఇతర మంత్రులు కైలాశ్‌ గహ్లోట్‌, సత్యేందర్‌ జైన్‌లపైనా దాడులు చేశారని, ఎలాంటి ఆధారాలు వారికి లభించలేదన్నారు.

ఇదీ చదవండి: కేజ్రీవాల్ ఎఫెక్ట్‌.. డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా ఇంట సీబీఐ రైడ్స్‌

మరిన్ని వార్తలు