కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నిక ఫలితాలు: ఎప్పుడూ ఏకగ్రీవమే, కానీ.. ఇప్పుడే ఇలా!

19 Oct, 2022 12:27 IST|Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు కాసేపట్లో తేలిపోనున్నాయి. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో దేశంలోని వివిధ పోలింగ్‌ బూత్‌ల నుంచి చేరిన పోస్టల్‌ బాలెట్‌ల నుంచి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మల్లికార్జున ఖర్గే, శశిథరూర్‌లో ఎవరు గెలుస్తారన్నది కాసేపట్లో తేలనుంది. అయితే.. 

మునుపెన్నడూ లేని విధంగా కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలు ఈసారి రసవత్తరంగా మారాయి. గాంధీయేతర కుటుంబం నుంచి అభ్యర్థి ఎన్నిక కాబోతుండడం, కాంగ్‌ సీనియర్లపై అభ్యర్థి శశిథరూర్‌ అసహనం వ్యక్తం చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలో ఓటింగ్‌పై శశిథరూర్‌ ఇవాళ సంచలన ఆరోపణలు చేశారు. 

ఓటింగ్‌ ప్రక్రియలో తీవ్రమైన అక్రమాలు జరిగాయంటూ కౌంటింగ్‌ వేళ ఆరోపణలకు దిగారాయన. ఉత్తర ప్రదేశ్‌ ఓట్లను రద్దు చేయాలని కోరారు ఆయన. ఇక ఓటింగ్‌ అవకతవకలతో పాటు కొన్ని అంశాలపై ఎన్నికల అధికారి మధుసుధన్‌ మిస్త్రీని కలిసినట్లు, తమ వర్గం తరపున లేఖ అందించినట్లు థరూర్‌ ఎలక్షన్‌ ఏజెంట్‌ సల్మాన్‌ సోజ్‌ వెల్లడించారు. ఉత్తర ప్రదేశ్‌ ఓటింగ్‌లో అవకతవకలు జరిగాయని, మల్లికార్జున ఖర్గేకు తెలియకుండా అది జరిగి ఉంటుందని, ఒకవేళ తెలిస్తే ఆయన సైతం ఆ అక్రమాలను సహించబోరని థరూర్‌ టీం లేఖలో పేర్కొంది. పోలింగ్‌తో సంబంధం లేని వాళ్ల సమక్షంలో బాలెట్‌ బాక్సులు ఉండడంపై అనుమానాలు ఉన్నట్లు తెలిపింది థరూర్‌ బృందం.  
అయితే ఓటింగ్‌ ప్రశాంతంగానే జరిగిందని, ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా నిర్వహించామని మధుసుదన్‌ మిస్త్రీ చెప్తున్నారు. మరో సీనియర్‌ సభ్యుడు జైరామ్‌ రమేశ్‌ సైతం ఎన్నికలు పారదర్శకంగానే జరిగినట్లు చెప్తున్నారు. 

► మొత్తం పోలైన 9,915 ఓట్లలో అధికంగా.. సగానికి(50 శాతం) పైగా ఓట్లు ఎవరికి పోలైతే ఆ అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తుంది కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల సంఘం. ఈ క్రమంలో మెజార్టీ తేలగానే కౌంటింగ్‌ను ఇక ఆపేస్తుంది కూడా.

► మునుపెన్నడూ లేని విధంగా గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా కాంగ్రెస్‌ ‘అధ్యక్ష ఎన్నిక’.. పార్టీలో అంతర్గత పోరును బయటపెట్టింది. పంజాబ్‌, కేరళ, యూపీ, మహారాష్ట్ర.. ఇలా చాలా చోట్ల కాంగ్రెస్‌ నేతల మధ్య చిచ్చును రాజేసింది. సీనియర్లు సైతం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడం గమనార్హం.

► అయితే ఎవరు గెలిచినా.. రిమోట్‌ కంట్రోల్‌ సోనియాగాంధీ కుటుంబం చేతుల్లోనే ఉంటుందన్న విమర్శలను పార్టీ ఖండిస్తోంది. సమర్థులైన ఇద్దరు అభ్యర్థులు బరిలో ఉన్నారని కాంగ్రెస్‌ మొదటి నుంచి చెబుతూ వస్తోంది. 

► ఇక శశిథరూర్‌ అసహనం మొదటి నుంచి చర్చనీయాంశంగా మారింది. సీనియర్లు, పార్టీలో కీలక పదవులు అనుభవిస్తున్న వాళ్లతో సహా పీసీసీ చీఫ్‌లు సైతం మల్లికార్జున ఖర్గేకు బహిరంగ మద్దతు ప్రకటించడంపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. అంతేకాదు.. 

► థరూర్‌ నామినేషన్‌ను ప్రతిపాదించిన కాంగ్రెస్‌ ఎంపీ కార్తీ చిదంబరం సైతం థరూర్‌ నినాదం ‘గుణాత్మక మార్పు’ ప్రచారం గురించి తప్పుడు సమాచారం కార్యకర్తల్లోకి వెళ్లిందని, అయినా ఆశాజనక ఓట్లు దక్కవచ్చని పేర్కొన్నారు. 

 2014తో పాటు 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓటమి పాలైంది. 2019 ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాహుల్‌ గాంధీ రాజీనామా చేశారు. దీంతో తాత్కాలిక అధినేత్రిగా సోనియా గాంధీ కొనసాగుతూ వస్తున్నారు. 

► పోటీలో శశిథరూర్‌ ప్రథమంగా బరిలో నిలవగా.. ఆయనకు ప్రత్యర్థిగా పలువురు అభ్యర్థులు పేర్లు తెరపైకి వచ్చాయి. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ బరిలో నిలవొచ్చని అంతా అనుకున్నారు. అయితే ముఖ్యమంత్రి మార్పు వ్యవహారం ఆ రాష్ట్ర రాజకీయంలో చిచ్చు పెట్టగా.. అధిష్టాన జోక్యంతో చల్లారింది.  చివరికి.. సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలో నిలిచారు. 

► స్వాతంత్రం అనంతరం నుంచి ఇప్పటిదాకా దాదాపుగా గాంధీ కుటుంబం నుంచే ఎవరో ఒకరు కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి ఎన్నికవుతూ వస్తున్నారు. ఆరుసార్లు మాత్రమే ఒకరి కంటే ఎక్కువ అభ్యర్థి నిలబడడంతో ఎన్నిక నిర్వహించారు. ఆ సమయాల్లోనూ అధిష్టాన మద్దతుతోనే అధ్యక్ష ఎన్నిక సజావుగా పూర్తైంది. ఇప్పుడు సుమారు 22 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక.. అందునా గాంధీయేతర కుటుంబం నుంచి ఎన్నిక కాబోతుండడం, తటస్థంగా ఉన్నట్లు అధిష్టానం ప్రకటించుకోవడం గమనార్హం.

>
మరిన్ని వార్తలు