Viral: ‘మా దేవుడు నువ్వేనయ్యా’.. మంత్రికి హారతి.. పూజలు!

11 Jul, 2021 12:30 IST|Sakshi

బతికుండగా.. అందులో ఓ మంత్రిగారికి హారతి అందిస్తూ పూజలు చేస్తున్నాడు ఓ వ్యక్తి.  ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్‌మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్నాయి. ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి చంద్రాపూర్‌లో ఓ బార్‌ ఓనర్‌. ఫొటోలో హారతి అందుకుంటోంది మహారాష్ట్ర గార్డియన్‌ మినిస్టర్‌ విజయ్‌ వాడెట్టివర్‌. జిల్లా వ్యాప్తంగా మద్య నిషేధం ఎత్తేయడంతో కృతజ్ఞతగా అలా పూజలు చేస్తున్నాడట. 

ముంబై:  మహరాష్ట్రలో చంద్రాపూర్‌తో పాటు వార్ధా, గడ్చిరోలి జిల్లాలో 2015, ఏప్రిల్‌ నెల అప్పటి ఫడ్నవిస్‌ సర్కార్‌ లిక్కర్‌ బ్యాన్‌ విధించి.. లైసెన్స్‌లు కూడా వెనక్కి తీసుకుంది. అప్పటి నుంచి ఈ మూడు జిల్లాల్లో మద్య నిషేధం అమలు అవుతోంది. ఇక ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని 2018లో రిటైర్డ్‌ అధికారి రామనాథ్‌ నేతృత్వంలో ఓ కమిటీని నియమించింది మహారాష్ట్ర సర్కార్‌. అయితే.. 

మద్యం అమ్మకాల నిషేధం వల్ల క్రైమ్‌ రేట్‌ తగ్గకపోగా.. నకిలీ మద్యం అమ్మకాలు పెరిగాయని ఈ ఏడాది మే నెలలో ఆ కమిటీ రిపోర్ట్‌ ఇచ్చింది. ఈ రిపోర్ట్‌ ఆధారంగా మద్య నిషేధాన్ని ఎత్తేస్తున్నట్లు శివసేన సర్కార్‌ పోయిన వారం ప్రకటించింది.  ఇక కమిటీకి మద్య నిషేధం ఎత్తేయాలని సూచించిన వాళ్లలో చంద్రాపూర్‌ జిల్లా గార్డియన్‌ మంత్రి (మొత్తం 36 మంది గార్డియన్‌ మంత్రుల హోదాలో జిల్లాలకు పర్యవేక్షకులుగా ఉన్నారు) విజయ్‌ వాడెట్టివర్‌ కూడా ఉన్నారు. అందుకే అలా హారతి ఇస్తున్నాడట ఆ బార్‌ ఓనర్‌. ‘మాకు ఆయన దేవుడే. మా బతుకు తెరువును మళ్లీ మాకు ఇప్పించాడు. అందుకే ఈ పూజలు’ అని చెప్తున్నాడు ఆ వ్యక్తి. ఇదిలా ఉంటే ఈ ఐదేళ్లలో మద్య నిషేదంతో చంద్రాపూర్‌ నుంచి సుమారు 1,600 కోట్ల రూపాయల్ని మహా సర్కార్‌ నష్టపోయింది.

మరిన్ని వార్తలు