ఒక్కో ఠాణాకు ఐదు టార్గెట్లు

20 Jan, 2021 08:25 IST|Sakshi

2022 నాటికి పనితీరు మెరుగు పర్చుకోండి 

ఢిల్లీ పోలీసులను కోరిన హోం మంత్రి అమిత్‌ షా

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతి పోలీసు స్టేషన్‌ తమ పనితీరు మరింత మెరుగుపర్చుకునేం దుకు ఐదు లక్ష్యాలను నిర్దేశించుకోవాలని హోం మంత్రి అమిత్‌ షా కోరారు. దేశం 75వ స్వాతంత్య్రదినోత్సవం జరుపుకోనున్న 2022 నాటికి వీటిని సాధించాలన్నారు. ఢిల్లీ పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రజలకు అత్యుత్తమ సేవలందించిన ఢిల్లీ పోలీసులను ఆయన అభినందించారు. పెద్ద సంఖ్యలో ఇళ్లకు పయనమైన వలస కార్మికులకు తోడ్పడారన్నారు. డ్రగ్స్‌ రవాణా, ఉగ్రవాదం, నకిలీ నోట్ల చెలామణీ, ట్రాఫిక్‌ సమస్య వంటి పలు సవాళ్లను ఢిల్లీ పోలీసులు సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోందని మంత్రి పేర్కొన్నారు. అంతేకాకుండా, రాష్ట్రపతి భవనం, ప్రధానమంత్రి నివాసం, వివిధ దేశాల దౌత్య కార్యాలయాలు, కీలక సంస్థల ప్రధాన కార్యాలయాలు ఉన్న విస్తారమైన ప్రాంతంలో బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటోందన్నారు. తప్పిపోయిన చిన్నారులను తిరిగి తల్లిదండ్రుల చెంతకు చేర్చడంలో ఢిల్లీ పోలీసులు చూపుతున్న చొరవను కొనియాడారు.

దేశ రాజధానిలో శాంతి భద్రతల నిర్వహణ, నేరగాళ్లు, నేరాలను క్షుణ్నంగా సమీక్షించేందుకు 15వేల సీసీటీవీ కెమెరాలను అమర్చుతామన్నారు. పోలీస్‌ సీసీటీవీ నెట్‌వర్క్‌ను రైలే స్టేషన్లలోని సీసీటీవీలతో అనుసంధానం చేస్తామన్నారు. పోలీసు బలగాల పరిశోధన సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ యూనివర్సిటీతో ఢిల్లీ పోలీసు శాఖ ఎంవోయూ కుదుర్చుకుందని అన్నారు. గత ఏడాది ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లలో కూడా పోలీసులు సమర్థంగా పనిచేసి, శాంతి భద్రతలను కాపాడారని అమిత్‌ షా కొనియాడారు. కరోనా మహమ్మారి సమయంలో విశేష ప్రతిభ కనబరిచిన కొందరు పోలీసులను సత్కరించారు. విధి నిర్వహణలో అసువులు బాసిన వారికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవాలకు చేపట్టిన ఏర్పాట్లపై ఉన్నతాధికా రులతో మంత్రి సమీక్ష జరిపారు. 26న రైతులు ప్రకటించిన ట్రాక్టర్‌ ర్యాలీపై ఢిల్లీ పోలీసులదే తుది నిర్ణయమంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ సమావేశం జరగడం గమనార్హం.

మరిన్ని వార్తలు