బెంగాల్‌ దంగల్‌: ‘అమిత్‌ షా అబద్ధాలు ఇవిగో..’

11 Mar, 2021 12:34 IST|Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం రసవత్తరంగా కొనసాగుతోంది. రాజకీయ నాయకుల పరస్పర విమర్శలతో వేడి రాజుకుంటోంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 2020 అక్టోబర్‌లో ఓ టీవీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. బెంగాల్‌లోని ప్రతి జిల్లాలో బాంబు తయారీ కర్మాగారాలున్నాయని వ్యాఖ్యానించారు. మమతపై విమర్శలు చేసే క్రమంలో బెంగాల్‌ను కించపరిచే విధంగా అమిత్‌ షా మాట్లాడారు.

బెంగాల్‌కు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త సాకేత్ గోఖలే ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. అమిత్‌ షా మితిమీరిన వ్యాఖ్యల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో బాంబు కర్మాగారాలపై సమాచారం కోసం ఆర్టీఐలో దరఖాస్తు చేయగా, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ  ఎలాంటి సమాచారం లేదని జవాబిచ్చిందని తెలిపారు. ప్రముఖ న్యూస్‌ చానళ్లు సైతం ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వాన్ని  ప్రశ్నించలేదని గుర్తు చేశారు. కొన్ని పత్రికలు పక్షపాతవైఖరిని అవలంభిస్తున్నాయని సాకేత్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

కాగా, సాకేత్‌ ట్వీట్‌పై నెటిజన్లు, టీఎమ్‌సీ నాయకులు స్పందించారు. ఎన్నికల్లో లాభం పొందడం కోసం బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని, అంతేకాకుండా బెంగాల్‌ ప్రతిష్టను దెబ్బతీసేలా చూస్తోందని ఆ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా ధ్వజమెత్తారు. బెంగాల్‌లో ఎలాంటి బాంబు తయారీ కర్మాగారాలు లేవని తేలిందన్నారు. అబద్దపు ఆరోపణలు చేసే బీజేపీ కర్మాగారానికి కొంచెం విశ్రాంతిని ఇవ్వండని హితవు పలికారు. ఇదిలాఉండగా.. బెంగాల్‌లో బాంబ్‌ తయారీ కర్మాగారాలు ఉన్నాయంటూ పశ్చిమ బెంగాల్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  దిలీప్ ఘోష్ కూడా గతంలో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా సీఎం మమతా బెనర్జీ బెంగాల్‌ను ‘రెండో కశ్మీర్’ గా మార్చారని విమర్శలు గుప్పించారు.
చదవండి: మమతా బెనర్జీ ఆరోగ్యంపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల

>
మరిన్ని వార్తలు