‘రామ మందిరానికి వ్యతిరేకంగానే నల్ల దుస్తులతో నిరసన’.. కాంగ్రెస్‌పై అమిత్‌ షా ఫైర్‌

5 Aug, 2022 20:50 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో ధరల పెరుగుదల, ఈడీ దాడులను నిరసిస్తున్నట్లు చెప్తూ.. శుక్రవారం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది కాంగ్రెస్‌ పార్టీ. ఢిల్లీలో చేపట్టిన నిరసనల్లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు నేతలు, కార్యకర్తలు నల్ల దుస్తులు ధరించి పాల్గొన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నిరసనలను తిప్పికొట్టారు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా. కాంగ్రెస్‌ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణ శంకుస్థాపనకు వ్యతిరేకంగానే నల్ల దుస్తులు ధరించారని ఆరోపించారు. 

‘కోర్టులో కేసులు నమోదయ్యాయి. అయితే, ప్రతిరోజు ఎందుకు నిరసనలు చేస్తున్నారు? కాంగ్రెస్‌కు రహస్య ఎజెండా ఉందని నా భావన. వారు వారి బుజ్జగించు రాయకీయాలను మరో రూపంలో అమలు చేస్తున్నారు. ఈరోజు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఎవరికీ సమన్లు జారీ చేయలేదు, ఎవరినీ ప్రశ్నించలేదు. ఎలాంటి రైడ్లు జరగలేదు. అయినప్పటికీ ఆకస్మికంగా ఈరోజు కాంగ్రెస్‌ నిరసనలకు దిగింది. ఈరోజే ఎందుకు నిరసనలు చేపట్టారనేది అర్థం కావట్లేదు. 550 ఏళ్ల సమస్యకు సామర్యంగా పరిష్కారం చూపి.. సరిగ్గా ఇదే రోజున అయోధ్య రామమందిర నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. అందుకే కాంగ్రెస్‌ నిరసనలు చేపట్టినట్లు తెలుస్తోంది. ’ అని పేర్కొన్నారు అమిత్‌ షా. 

ఈరోజు నల్ల దుస్తులు ధరించి నిరసనలు చేపట్టటం ద్వారా తాము రామ మందిర నిర్మాణ శంకుస్థాపనకు వ్యతిరేకమని కాంగ్రెస్‌ చెబుతోందన్నారు హోంమంత్రి అమిత్‌ షా. బుజ్జగింపు పాలసీని ఈ విధంగా ముందుకు తీసుకెళ్తోందని ఆరోపించారు. ప్రస్తుత రోజుల్లో దేశంలో హింసాత్మక ఘటనలు, అల్లర్లు జరిగినట్లు కనిపిస్తోందా? ‍అని ప్రశ్నించారు షా.

ఇదీ చదవండి: హస్తినలో తీవ్ర ఉద్రిక్తతలు.. పోలీసుల అదుపులో ప్రియాంక, రాహుల్‌

మరిన్ని వార్తలు