Amit Shah In Manipur: మణిపూర్‌లో అమిత్‌ షా పర్యటన.. వారికి రూ.10 లక్షల నష్టపరిహారం 

30 May, 2023 16:28 IST|Sakshi

మణిపూర్ ఇటీవల చెలరేగిన అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా రూ. 10 లక్షలు నష్టపరిహారం ప్రకటించింది. అదే విధంగా మరణించిన వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వనున్నట్లు వెల్లడించింది. 

కాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా నేడు (మంగళవారం) మణిపూర్‌లో పర్యటించారు. అల్లర్లు జరిగిన చురాచంద్ పూర్ జిల్లాలోని స్థితిగతులను పరిశీలించారు. తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి బైరెన్ సింగ్‌తో భేటీ అయ్యి జరిగిన ఆస్తి నష్టానికి, ప్రాణ నష్టానికి ఏ విధమైన పరిహారం అందించాలన్న విషయంపై చర్చించారు.

ఈ సందర్బంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ మణిపూర్‌లో ఇటువంటి సంఘటన జరగడం దురదృష్టకరమని, ప్రాణనష్టం జరిగిన కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా వెంటనే అందిస్తామని తెలిపారు. పెట్రోల్, గ్యాస్, రైస్, నిత్యావసర వస్తువులకు కొదవ రానీయకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.  ఇదిలా ఉండగా ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఈశాన్య రాష్ట్రమైన  మణిపూర్‌లో  మే 3న ఉన్నట్టుండి అల్లర్లు చెలరేగి మారణహోమం జరగడంతో యావత్ భారతదేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది.

రాష్ట్రంలో ఎప్పటి నుంచో  ఆశ్రయముంటున్న మెయితేయి  వారికి కుకి తెగల మధ్య రగిలిన చిచ్చు చిన్న గాలివానలా మొదలై పెనుమంటలను రాజేసింది. భారీగా ఆస్తి నష్టానికి, ప్రాణనష్టానికి దారితీసింది. ఈ అల్లర్లలో సుమారుగా 70 మంది ప్రాణాలను కోల్పోగా 230 మంది గాయపడ్డారు. సుమారుగా 1700 ఇళ్ళు  అగ్నికి ఆహుతయ్యాయి.
చదవండి: రోడ్డుపై లవర్స్‌ రొమాంటిక్ వీడియో.. కేసుపై పోలీసుల తంట..!

మరిన్ని వార్తలు